వైసీపీ నేతలు ఆనందోత్సాహాలతో ఉన్నారు. వారికి ఆనందం వస్తే ఏం చేస్తారు..? చంద్రబాబును తిడతారు. ఇప్పుడు అదే చేస్తున్నారు. మంత్రి కన్నబాబు కాకినాడలో ప్రెస్మీట్ పెట్టి చంద్రబాబును రెండు ఎకరాల దగ్గర్నుంచి వ్యవస్థల్ని మేనేజ్ చేయడం దాకా … ఎప్పుడూ తిట్టే తిట్లన్నింటినీ తిట్టారు. ఎప్పుడు ఎవరు ప్రెస్మీట్ పెట్టినా వారికి అది తప్పదు. ఈ తిట్ల మధ్యలో కన్నబాబు కొన్ని విషయాలు చెప్పారు. అదేమిటంటే.. సాక్షిలో పెట్టుబడులను పెట్టుబడులుగానే ఐటీ శాఖ గుర్తించిందని.. అది తమ నిజాయితీకి చిహ్నమన్నారు. అంటే జగన్ నిజాయితీకనన్నమాట.. ఒకప్పుడు ఈ పెట్టుబడులను ప్రశ్నించిన వారిలో కన్నబాబు కూడా ఉన్నారు..
సాక్షిలో పెట్టుబడులు గానే అందరూ చెప్పుకుంటున్నారు. క్విడ్ ప్రో కో పెట్టుబడులని కేసులు నమోదయ్యాయి. కొత్తగా పెట్టుబడులను పెట్టుబడులుగా గుర్తించారని ఐటీ ట్రిబ్యూనల్ ఆదేశాలివ్వడం దానికి.. వైసీపీ సంబరాలు చేసుకోవడం.. వెంటనే… చంద్రబాబే అవినీతి పరుడని చెప్పడం ఏమిటన్న సందేహం చాలా మందికి వస్తోంది. దీని వెనుక చిన్న స్టోరీ ఉంది. మొదట్లో ఐటీ శాఖ ఈ పెట్టుబడులను ఆదాయంగా గుర్తిస్తూ ఆదేశాలు ఇచ్చింది. దానిపై పన్ను కట్టాలని ఆదేశించింది. అయితే అవి ఆదాయం కాదని.. పెట్టుబడులని .. పన్ను కట్టలేమని ఐటీ శాఖ ట్రైబ్యూనల్ను జగన్ అండ్ కో ఆశ్రయించారు. ఆ పిటిషన్పై ఇప్పుడు తీర్పు వచ్చినట్లుగా తెలుస్తోంది. అధికారిక ఆదేశాలు ఇంకా ఎవరికీ తెలియలేదు. కానీ వైసీపీ నేతలు మాత్రం క్లీన్ చిట్ అని ప్రచారం చేసుకుంటున్నారు.
ఐటీ శాఖ ట్రైబ్యునల్ ఇచ్చిన ఓ చిన్న తీర్పును పట్టుకుని అవినీతి కేసుల్లో క్లీన్ చిట్ వచ్చిందన్నంతగా సంతృప్తి పడిపోతున్న వైసీపీ నేతల్ని చూసి టీడీపీ నేతలు కూడా ఆశ్చర్యపోతున్నారు. నిజంగానే అలాంటి తీర్పు వచ్చిందా అని చెక్ చేసుకుంటున్నారు. చివరికి విషయం తెలిసి అల్పసంతోషులను సరి పెట్టుకుంటున్నారు. ఎంతైనా రాజకీయం అంటే.. బురత చెరుపుకోవడానికి ఏ చిన్న అవకాశం దొరికినా ఉపయోగించుకోవడం.. ఎదురువారిపై టన్నుల కొద్దీ పోయడం. ఈ విషయంలో చాంపియన్లు కొంతమందే ఉంటారు.