తెదేపాలో చేరిన వైకాపా ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి తదితరులు డబ్బుకు అమ్ముడుపోకపోయుంటే తక్షణమే తమ పదవులకి రాజీనామా చేసి తమ స్వంత బలంతో గెలిచి చూపించాలని వైకాపా నేతలు సవాలు విసురుతున్నారు. వారు ఆవిధంగా కోరడంలో తప్పేమీ లేదు. కానీ వారికి భూమా నాగిరెడ్డి చాల చిత్రమైన సవాలు విసిరారు. “మేము రాజీనామా చేసి ఎన్నికలలో పోటీ చేసి మళ్ళీ గెలవగలము. గెలిస్తే వైకాపాని మూసేసుకొంటారా?” అని సవాలు విసిరారు.
వైకాపా పేరు చెప్పుకొని ఆ పార్టీ తరపున ఎన్నికైన ఆయన వేరే పార్టీలోకి మారేముందే తన ఎమ్మెల్యే పదవిని వదులుకొని ఉంటే చాలా హుందాగా ఉండేది. కానీ ఆవిధంగా చేయకుండా తను రాజీనామా చేసి ఎన్నికలలో పోటీ చేస్తే అదేదో వైకాపాని ఉద్ధరించినట్లు మాట్లాడటం, తను గెలిస్తే వైకాపా మూసుకొంటారా? అని సవాలు విసరడం చాలా విడ్డూరంగా ఉంది. ఆయన గెలిచినా, ఓడినా వైకాపా ఎందుకు మూసుకోవాలి? పబ్లిక్ అకౌంట్స్ చైర్మన్ పదవిని ఏవిధంగా వదులుకొన్నారో అదే విధంగా ఎమ్మెల్యే పదవిని కూడా ఎందుకు వదులుకోవడం లేదు? అంటే తప్పదు గాబట్టి దానిని వదులుకొన్నారు. అవకాశం ఉంటే దానిని అట్టేబెట్టుకొనేవారేనని భావించవచ్చు.
కొంచెం ఆలస్యంగానైనా భూమా నాగిరెడ్డి సవాలుని వైకాపా ఎంపి మిథున్ రెడ్డి అదేవిధంగా త్రిప్పి కొట్టారు. “చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాష్ట్రాన్ని చాలా అభివృద్ధి చేస్తోందని చెపుతూ వైకాపా ఎమ్మెల్యేలు తెదేపాలో చేరుతున్నారు. కానీ ఈ రెండేళ్లలో రాష్ట్రం ఎక్కడ అభివృద్ధి చెందిందో చెప్పగలరా? వాళ్ళు తెదేపాలో చేరడానికి వేరే కారణాలు ఉన్నాయని అందరికీ తెలుసు. కానీ వాటి గురించి చెప్పకుండా ఎక్కడా కనబడని అభివృద్ధిని చూసి చేరామని చెప్పుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది. తెదేపాలో చేరిన వైకాపా ఎమ్మెల్యేలు గెలిస్తే మా పార్టీని మూసుకొంటారా? అని అడిగారు. ఒకవేళ వాళ్ళ స్థానాలను వైకాపా గెలుచుకొంటే తెదేపాని మూసేస్తారా?” అని మిథున్ రెడ్డి సవాలు విసిరారు.
వాళ్ళు తమ అధినేతల మెప్పు పొందడానికి, తమ ఉనికి చాటుకోవడానికి మాత్రమే ఈవిధంగా సవాళ్లు, విమర్శలు చేసుకొంటుంటారు తప్ప ఎవరూ రాజీనామాలు చేయరు..పార్టీలు మూసుకోరని అందరికీ తెలుసు.