ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది జగన్ లో ఓడిపోతామన్న భయం ఎక్కువవుతుందా…? సామాజిక సమీకరణాల పేరుతో ఇచ్చిన సీట్లలో మార్పులు చేర్పులు చేయబోతున్నారా…? మూడు సీట్లలో అభ్యర్థులను మార్చేందుకు నిర్ణయం జరిగిపోయిందా…?
వైసీపీ పెద్దల నుండి అందుతున్న సమాచారం ప్రకారం అవుననే సమాధానం వస్తోంది. కూటమిలో ఉన్న పార్టీల మధ్య ఓట్లు బదిలీ కావని, గ్రూపులతో తమకే లాభం జరుగుతుందని వైసీపీ మొదట అంచనా వేసింది. కూటమిలో పార్టీల మధ్య చిన్న చిన్న అసంతృప్తులను పెద్దగా చేసి చూపే ప్రయత్నంతో పాటు కొందరు నాయకులతో టచ్ లో ఉండి పెద్దది చేసే ప్రయత్నం చేసినా ఫలితం శూన్యం. పైగా.. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ కూటమిపై సానుకూల మౌత్ పబ్లిసిటీ వస్తుండటం వైసీపీ పెద్దల్లో కలవరం పెడుతోంది.
దీంతో, కొన్ని చోట్ల ఇప్పటికే ప్రకటించిన సీట్లలో మార్పులు చేర్పులు ఉండబోతున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా మైలవరం నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీ నుండి పోటీ చేస్తున్నారు. చంద్రబాబు సన్నిహితుడిగా ఉండే దేవినేని ఉమను కాదని మరీ గెలుపే లక్ష్యంగా వసంతకు టీడీపీ టికెట్ ఇచ్చింది. దీంతో వైసీపీ కుల సమీకరణాల లెక్కలు వేసుకొని చివరకు మైలవరం ఎంపీపీగా ఉన్న సర్నాల తిరుపతిరావును ప్రకటించారు. కానీ ఇప్పుడు తను గెలిచే అవకాశం లేకపోవటంతో అక్కడి నుండి మంత్రి జోగి రమేష్ ను బరిలోకి దింపే అవకాశం కనపడుతోంది. పెడన నుండి గెలిచిన మంత్రి జోగి రమేష్ కు ఈసారి పెనమలూరు టికెట్ ఇచ్చారు. కానీ అక్కడ స్థానికత ఇష్యూ బలంగా ఉండటం, గతంలో మైలవరంలో జోగి రమేష్ కు పోటీ చేసిన అనుభవం కూడా ఉండటంతో మైలవరం నుండి పోటీ చేయించే ఆలోచనలో వైసీపీ ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక మరో మంత్రి విడదల రజినీ సీటు కూడా మరోసారి మారబోతున్నట్లు తెలుస్తోంది. చిలకలూరిపేట నుండి గెలిచిన ఆమెను ఈసారి గుంటూరు వెస్ట్ కు పంపారు. ఇప్పుడు తనను గుంటూరు ఎంపీగా పోటీ చేయించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గుంటూరు వెస్ట్ అభ్యర్థిగా కిలారి వెంకట రోశయ్యను ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది.
ఇక జనసేన నుండి వైసీపీలో చేరిన పోతిన మహేష్ కు విజయవాడ వెస్ట్ సీటు కేటాయిస్తారని ప్రచారం జరుగుతుండగా… మైలవరం, గుంటూరు ఎంపీ, గుంటూరు వెస్ట్ సీట్లపై ఈనెల 12న గుంటూరులో జరిగే సమవేశంలో సీఎం జగన్ అభ్యర్థుల మార్పును అధికారికంగా ప్రకటించే అవకాశం కనపడుతోంది.
వీటితో పాటు కడప ఎంపీ సీటు విషయంలో వైసీపీలో తర్జనభర్జన కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. కడప ఎంపీగా వైఎస్ షర్మిల కాంగ్రెస్ నుండి పోటీ చేస్తుండటం, వివేకా కూతరు సునీతతో పాటు షర్మిల డైరెక్టుగా అవినాష్ ను వివేకా హంతకుడు అంటూ విమర్శిస్తుండటం… వైసీపీకి ఇబ్బందిగా మారిందని, అవినాష్ కు టికెట్ ఇచ్చినందుకే తాను పోటీ చేస్తున్నానన్న విమర్శలకు చెక్ పెడుతూ… వైఎస్ అభిషేక్ రెడ్డిని రంగంలోకి దింపాలన్న ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అవినాష్ బెయిల్ రద్దుపై సీబీఐ కోర్టులో బలంగా వాదిస్తున్న తరుణంలో… ఎన్నికలు దగ్గరకు వచ్చాక బెయిల్ రద్దైతే ఆ ప్రభావం రాష్ట్రం అంతా ఉంటుందని, ముందే అవినాష్ రెడ్డిని తప్పిస్తే బెటర్ అన్న ఉద్దేశం జగన్ అండ్ కో లో ఉందని ప్రచారం జరుగుతోంది.
అయితే, అభ్యర్థుల మార్పుపై తెలుగు360 వైసీపీ నాయకులను వివరణ కోరగా… అభ్యర్థుల మార్పును వారు అధికారికంగా ధృవీకరించ లేదు. అలాగని ఖండించనూ లేదు. కానీ పార్టీలో ఇంటర్నల్ గా చర్చ అయితే సాగుతోంది. నామినేషన్లకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో మారిస్తే క్యాడర్ కు రాంగ్ మెసెజ్ వెళ్తుందా అన్న తర్జనభర్జనలో అధినాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది.