హత్యా రాజకీయాలు చేయడంలో తనకు ఎవరూ సాటిలేరని నిరూపిస్తున్నారు జగన్. రాజకీయం చేసేందుకు ఇంతకుమించిన సందర్భం మరొకటి ఉండదని అనుకున్నారో ఏమో, పరామర్శల పేరుతో హత్య జరిగిన ప్రాంతాలకు వరుసపెట్టి వెళ్తున్నారు. బాధిత కుటుంబాలను ఓదార్చాల్సిన చోట కూడా రాజకీయ అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అమ్మ ఒడి అందటం లేదని, కూటమి హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తుందని ఆరోపణలు గుప్పిస్తోన్న జగన్ వ్యాఖ్యలపై తీవ్ర చర్చ జరుగుతోంది.
వైసీపీ అధికారం కోల్పోయాక రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ క్యాడర్ దిక్కుతోచని స్థితిలో ఉంది. నేతలూ పట్టించుకోవడం లేదు. అయినా వారిని ఏమాత్రం పట్టించుకోకుండా, కనీసం నేనున్నానని భరోసా ఇవ్వడానికి కూడా జగన్ సాహసించడం లేదు. కానీ, ఆయన హత్యోదంతాలు చోటు చేసుకున్న ప్రాంతానికి మాత్రమే వెళ్తుండటంతో హత్య రాజకీయాలు చేస్తున్నది ఎవరు? అనే ప్రశ్న తెరమీదకు వస్తోంది. వినుకొండలో జరిగిన హత్య ఘటన పాత గొడవలతో జరిగింది. ఇక , ఎన్టీఆర్ జిల్లా నవాబుపేటలోనూ ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణను టీడీపీ కార్యకర్తలకు అంటగట్టే ప్రయత్నం చేశారు జగన్. రెండు ఘటనలు టీడీపీ కార్యకర్తలే చేశారని..రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవంటూ గగ్గోలు పెట్టారు. నంద్యాలలోనూ ఇదే తరహ ఘటన జరిగిందని.. శుక్రవారం అక్కడికి వెళ్తానని తెలిపారు. ఎక్కడ ఏం జరిగినా..హత్య జరిగినా టీడీపీకి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు.
పైగా.. పరామర్శకు వెళ్లిన జగన్ అక్కడ పాలిటిక్స్ మాట్లాడుతున్నారు.చావు దగ్గర కూడా రాజకీయాల గురించే మాట్లాడుతారా అంటూ విమర్శలు వచ్చినా..జగన్ తీరు మార్చుకోలేదు. నవాబుపేటకు వెళ్ళి అక్కడ అదే తరహా వ్యాఖ్యలు చేయడంతో.. హత్యా రాజకీయాలు చేస్తున్నది కూటమి సర్కార్ కాదు.. జగనే అని విమర్శలు వస్తున్నాయి. మొత్తానికి ఈ ఘర్షణపూరిత రాజకీయాలతో వైసీపీ గ్రాఫ్ పెంచుకోవాలని చూస్తున్న జగన్ కు తన వైఖరే శాపంగా మారుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.