జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన వాయిదాకు కారణాలు వైసీపీ పెద్దలకే తెలుసు. బయటకు ఏవో చెబుతూంటారు. కానీ వారి మాటల్లో మాత్రం కొన్ని కారణాలను వెదికి పట్టుకోవచ్చు. ఇలా శుక్రవారం నుంచి వైసీపీ నేతలు మాట్లాడుతున్న మాటల్ని బట్టి చూస్తే జగన్ అసలు ఇంట్లో నుంచి బయటకు రాకపోవడానికి ఓ కారణం ..బీజేపీ నేత మాధవీలత అని అర్థం చేసుకోవచ్చు.
జగన్మోహన్ రెడ్డి తన ప్రెస్ మీట్ లో బీజేపీ నేతలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మాధవీలత ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. ఆమె వెళ్లడంపై బీజేపీ పెద్దల అనుమతి ఉందా అని ప్రశ్నించారు. ఆ తర్వాత పేర్ని నాని కూడా మాధవీలతపై విరుచుకుపడ్డారు. ఓ గుళ్లో శనివారం పూజలు చేసి ఆయన మాధవీలత భజన చేసుకుంటూ వెళ్లారని.. కరోనా సమయంలో ఆమె ఎంత మందికి తన ఆస్పత్రిలో ఉచిత వైద్యం చేశారని ప్రశ్నించారు. ఇంకా చాలా మంది ఆమెపై స్పందిస్తున్నారు. ఈ పరిస్థితి చూస్తే మాధవీలత వైసీపీ నేతల్ని ఎక్కువగా భయపెట్టినట్లుగా అర్థం చేసుకోవచ్చు.
నిజంగానే మాధవీలత హైదరాబాద్లో తన మద్దతుదారులతో కలిసి భజన చేసుకుంటూ బయలుదేరినప్పటి నుంచి హాట్ టాపిక్ గానే ఉన్నారు. తిరుమలలో ఆమె జగన్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. చాలా అగ్రెసివ్ గా ఉన్న ఆమె తిరుమలలోనే ఉంటే సమస్యలు వస్తాయని.. వ్యూహాత్మకంగానే ఆమెను పంపారన్న అనుమానాలతో జగన్ , వైసీపీ తమ టూర్ పై మరోసారి ఆలోచన చేసుకున్నారని అనుకోవచ్చు. మొత్తంగా మాధవీలత తీరుపై అనేక మంది విమర్శలు చేస్తున్నప్పటికీ ఆమె స్టైల్లో మరింత అగ్రెసివ్ నెస్ పెరుగుతోంది కానీ తగ్గడం లేదు.