ఆంధ్రప్రదేశ్లో విచిత్రమైన పరిస్థితి ఉంది. సాధారణంగా ఎమ్మెల్యేలపై వారి అనుచరుల నుంచి ఒత్తిడి ఉంటుంది. పార్టీ అధికారంలోకి వచ్చింది.. తమకేమైనా ఆదాయ మార్గాలు చూపించాలని విజ్ఞప్తిచేస్తూ ఉంటారు. గతంలో సీఎం జగన్ కూడా.. మన ప్రభుత్వం వచ్చాక.. నామినేషన్ పద్దతిపై అందరికీ కాంట్రాక్ట్ పనులు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఏపీలో చేయడానికి బోలెడన్ని పనులు ఉన్నాయి. ఇతర పనుల సంగతి పక్కన పెడితే.. రోడ్లను రిపేర్ చేయడానికి ప్రతి నియోజకవర్గంలోనూ కోట్ల రూపాయల విలువైన పనులు ఉన్నాయి. ఆ పనులు చేపట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
కానీ.. పనులు చేయడానికి కాంట్రాక్టర్లే సిద్ధంగా లేరు. నామినేషన్ పద్దతిన అయినా పనులు ఇస్తాం చేయమని వైసీపీ ఎమ్మెల్యేలు తమ అనుచరుల్ని అడుగుతున్నా.. వారు వద్దంటున్నారు. తాము పనులు చేపట్టలేమని.. తమకు పనులేమీ వద్దని అంటున్నారు. పార్టీ క్యాడర్ తీరుతో ఎమ్మెల్యేలు కూడా ఆశ్చర్యపోతున్నారు. అయితే.. వారు మాత్రం పెద్దగా ఒత్తిడి చేయడం లేదు. అలా ఒత్తిడి చేస్తే తమకు ఇబ్బంది అని వారికి అర్థమైపోయింది. దీనికి కారణం.. కాంట్రాక్టులు తీసుకుని తర్వాత బిల్లులు చెల్లింకపోతే.. ఆ నేతలంతా తమపై పడతారని.. వారికి సర్ది చెప్పడం కష్టమని అనుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు చెల్లించే పరిస్థితిలో లేదు.
ఇంతకు ముందు పనులు చేసిన కాంట్రాక్టర్లకు పెద్ద ఎత్తున బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఆ బిల్లులు క్లియర్ చేస్తేనే వారుపనులు చేస్తామని ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. మరికొంత మంది అయితే బిల్లుల కోసం కోర్టుకు వెళ్తున్నారు. ఈ పరిణామాలతో వైసీపీలో కాంట్రాక్ట్ పనులు అడిగేవారు లేరు.. ఇద్దామన్నా చేసేవారు లేకుండా పోయారు. ప్రభుత్వ ఆర్థిక ఇబ్బందుల కారణంగా. .. పార్టీ నేతలకు కూడా ఆదాయమార్గాలు తగ్గిపోయాయన్న ఆవేదన వారి క్యాడర్లో కనిపిస్తోంది.