ఏపీలో వైసీపీకి అప్పుల తిప్పలు ఎక్కువగా ఉన్నాయి. బయట నుంచి అప్పులు తెచ్చుకోవడం కష్టం కావడం లేదు కానీ.. విపక్ష నేతలు విమర్శించడం మాత్రం చాలా కష్టంగా ఉంది. అందుకే ముఖ్యంగా బీజేపీ కొత్త అధ్యక్షురాలు పురందేశ్వరి చేస్తున్న విమర్శలకు మీడియాలో ఎక్కువ ప్రచారం లభిస్తూండటంతో చాలా కాలంగా బయటకు కనిపించని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెరపైకి వచ్చారు.
అసలు ఎన్ని అప్పులు చేశారన్న కథలోకి పోకుండా.. నిర్మలా సీతారామన్ చెప్పారు..ఆర్బీఐ రిపోర్టును నమ్మరా… అంటూ ఎదురుదాడికి దిగారు. చివరికి అప్పుల గురించి ఎప్పుడూ మాట్లాడని గంటా శ్రీనివాస్ కూడా ప్రశ్నిస్తున్నారని చెప్పుకొచ్చారు. నిర్మలా సీతారామన్ చెప్పినది ఆర్బీఐ దగ్గర తీసుకున్న అప్పులు మాత్రమే కార్పొరేషన్ల పేరుతో ఏడాదికి రూ. లక్ష కోట్ల వరకూ అప్పులు చేశారన్న ఆరోపణలు.. వాటి గురించి కనీసం కాగ్ కు కూడా సమాధానం ఇవ్వడం లేదన్న విమర్శలు ఉన్నాయి. వాటి గురించి మాత్రం బుగ్గన స్పందించ లేదు.
అప్పుల విషయంలో నిర్మలా సీతారామన్ .. జగన్ రెడ్డి ప్రభుత్వానికి ఊహించనంత అండగా ఉంటున్నారు. అప్పులకు ఎన్ని అనుమతులు కావాలంటే అన్ని అనుమతలు ఇవ్వడంతో పాటు.. అన్ని రకాల నిబంధనలు ఉల్లంగిస్తున్నా.. చివరికి కాగ్ అడిగిన వివరాలు ఇవ్వకపోయినా పట్టించుకుంటున్న దిక్కు లేదు. పైగా.. రాజకీయంగా విమర్శలు వస్తే.. వైసీపీని కాపాడటానికి.. సొంత పార్టీని ఇబ్బంది పెట్టేలా అరకొర సమాధానాలిస్తున్నారు. అంతకు ముందు రోజే నిర్మలా సీతారామన్ కు పురందేశ్వరి ఫిర్యాదు చేసినా.. ఆమె మాత్రం వైసీపీకి అనుకూలంగా ఉండే రిపోర్టు విడుదల చేశారు.
బుగ్గన కూడా ఈ ఫిర్యాదుల్ని మరో రకంగా చెప్పుకున్నారు. కేంద్రం నుంచి నిధుల సహకారం అందకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. నిధుల సహకారం అంటే అప్పులే.. అందాల్సిన సహకారం.. అందించాల్సిన సహకారం.. కావాల్సినంత అందుతున్నప్పుడు.. బీజేపీ నేతలు చేసిన విమర్శలైనా వైసీపీకీకి పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ ఎక్కువ ప్రచారం జరిగితే మాత్రం తట్టుకోలేకపోతున్నారు.