జనసేన ఆవిర్బావ దినోత్సవ సభలో పవన్ కల్యాణ్ చేసిన ప్రసంగం వైసీపీలో కాక రేపినట్లుగానే కనిపిస్తోంది. పవన్ అలా ప్రసంగం ముగించగానే ఇలా బిలబిలమంటూ మీడియా ముందుకు వచ్చేసిన వైసీపీ నేతలు.. మంగళవారం కూడా ఆ ధాటిని కంటిన్యూ చేశారు. పేర్ని నానితో ప్రారంభించి.. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వరకూ అందరూ ఒక్కో టైంలో రోజంతా మీడియా ముందుకు వస్తూనే ఉన్నారు. షరా మామూలుగా అందరూ వ్యక్తిగతంగా దూషించారు. అయితే పవన్ కల్యాణ్ లేవనెత్తిన ప్రభుత్వ వై్ఫల్యాలపై ఒక్కరూ మాట్లాడలేదు. కానీ అందరూ కోరస్‌గా ఒకటే మాట వినిపించారు. అది విమర్శ కాదు.. డిమాండ్ అనుకోవచ్చు. అదేమిటంటే.. దమ్ముంటే.. ధైర్యం ఉంటే.. ఒంటరిగా పోటీ చెయ్ అనేదే.
పవన్ కల్యాణ్ ఒంటరిగా పోటీ చేస్తాడో.. పొత్తులతో పోటీ చేస్తాడో ఆయన వ్యక్తిగత విషయం. ఆయన పార్టీకి సంబంధించిన విషయం. ఆయన చేసిన విమర్శలు వేరే ఉన్నాయి. వాటిని పట్టించుకోకుండా పవన్ కల్యాణ్‌ను రెచ్చగొట్టి ఏ పార్టీతోనూ పొత్తులు లేకుండా ఒంటరిగా పోటీ చేయించాలన్న లక్ష్యంతో… ఎవరికి వారు వైసీపీ నేతలు తమ ప్రతిభా ప్రదర్శన చేశారు. కానీ రాజకీయాలు వైసీపీ నేతలకే కాదని.. అందరికీ తెలుసని వారు అంచనా వేయలేకపోయారని జనసేన వర్గీయులు సెటైర్లు వేస్తున్నారు. పవన్ కల్యాణ్ టీడీపీతో ఎక్కడ కలుస్తారో అని వైసీపీ నేతలు భయపడిపోతున్నారని అంటున్నారు. తాము ఎవరితో కలిస్తే మీకేంటని ప్రశ్నిస్తున్నారు.
పవన్ తన ప్రసంగంలో రాజధాని దగ్గర్నుంచి ఇసుక వరకు అనేక విధానపరమన విమర్శలు చేశారు. అవన్నీ నిజం కాదని.. అబద్దమని ఒక్కరంటే ఒక్క వైసీపీ నేత స్పందించలేదు. పవన్ కల్యాణ్‌కు రాజకీయం తెలియదు.. పవన్ ఒంటరిగా పోటీ చేయలేరు..అంటూ రకరకాల కబుర్లు చెబుతూ కాలక్షేపం చేశారు. మొత్తంగా పవన్ కల్యాణ్ పొత్తులపై మాట్లాడిన వైసీపీ నేతలకు నచ్చలేదు. అందుకే తమకు మాత్రమే సాధ్యమైన బూతుల భాషను కూడా ప్రయోగిస్తూ పవన్ మనసు విరిచేందుకు చేయాల్సినంత ప్రయత్నం చేశారని అనుకోవచ్చు.