నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభిస్తున్నారనేసరికి వైసీపీ కంగారుగా చివరికి సిల్లీ కుట్రలకు తెర లేపుతోంది. అనుమతులు ఇవ్వకపోవడం.. పార్టీ నేతలను విచారణల పేరుతో పోలీస్ స్టేషన్లకు పిలిపించడం వంటి ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇలాంటివన్నీ ఆ పాదయాత్రపై అదనపు ఆసక్తిని కల్పిస్తున్నాయి. ఈ విషయంలో వైసీపీ తప్పు చేస్తున్నామన్న విషయం చేతులు కాలిన తర్వాత తెలుసుకుంటుందేమో కానీ..ఇప్పటికైతే సిల్లీ కుట్రలను ఓ రేంజ్లో ప్రారంభించింది.
టీడీపీ యువ నేత, లోకేష్ పాదయాత్ర విషయంలో కీలకంగా వ్యవహరిస్తున్న చింతకాయల విజయ్ కు సీఐడీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. భారతి పేర కేసులో విచారణకు రావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నోటీసుల్లో ఏముందంటే..27వ తేదీన విచారణకు రావాలని ఉంది. ఆ రోజే లోకేష్ కుప్పంలో పాదయాత్ర ప్రారంభిస్తున్నారు. ఈ నోటీసులు చూసి టీడీపీ నేతలు కూడా నవ్వుకుంటున్నారు. పాదయాత్రపై ఎంత భయపడుతున్నారో ఈ సిల్లీ కుట్రలు చూస్తే తెలిసిపోతోందని అనుకుంటున్నారు. మరింత మంది టీడీపీ నేతలకూ ఇలాంటివే రావొచ్చని చెప్పుకుంటున్నారు.
అదే సమయంలో పాదయాత్రకు అనుమతి, భద్రత కల్పించడంపై టీడీపీ నేతలు గతంలో రికార్డెడ్ గా అందించిన దరఖాస్తులను పోలీసులు ఇంత వరకూ పట్టించుకోలేదు. అనుమతులు ఇవ్వడం.. ఇవ్వకపోవడంపై ఎలాంటి సమాధానం రాలేదు. దాంతో వర్ల రామయ్య మరోసారి డీజీపీకి లేఖ రాశారు. ఇక్కడ చట్ట ప్రకారం టీడీపీ ఏం చేయాలో అది చేస్తోంది. అదే సమయంలో జగన్ పాదయాత్ర ప్రారంభించినప్పుడు.. ఒక్క చోట కూడా అనుమతి తీసుకోలేదు. కానీ పోలీసులు భద్రత కల్పించారు. అప్పట్లో వైసీపీ నేతలు చేసిన స్టేట్మెంట్లను ప్రజల ముందు ఉంచుతున్నారు టీడీపీ నేతలు. ప్రతిపక్ష నాయకుడిగా స్వేచ్చ అనుభవించి ఇప్పుడు సీఎం అయ్యాక ఆయన రివర్స్ వ్యవహారాలను ప్రజల ముందు ఉంచుతున్నారు. లోకేష్ పాదయాత్రకు అనుమతి ఇవ్వకుండా రచ్చ చేయడం అనేది మరింత సిల్లీ అవుతుందన్న అభిప్రాయం వైసీపీలోనే వినిపిస్తోంది.
ఇంకావారం రోజుల్లో పాదయాత్ర ప్రారంభం కాబోతోంది. ఇంకా చాలా సిల్లీ కుట్రలను చూడాల్సి వస్తుందని టీడీపీ నేతలంటున్నారు. అయితే పాదయాత్ర మాత్రం ఆగదని.. ప్రభుత్వానికి చాలెంజ్ చేస్తున్నారు.