రాజకీయంగా తప్పులు తప్పనిసరిగా చేస్తున్నామని తెలిసి కూడా చేస్తున్నారు వైసీపీ నేతలు. అబద్దాలు ప్రచారం చేసుకుని అడ్డంగా పరువు పోగొట్టుకుంటున్నారు. ఒకటి రెండు రోజులు ఆలస్యంగానైనా బయటకు వచ్చే నిజం …పరువు తీస్తుందని తెలిసినా వెనక్కి తగ్గడం లేదు. విపక్ష పార్టీల సమావేశానికి మమతా బెనర్జీ బీజేపీ యేతర ముఖ్యమంత్రులందరికీ ఆహ్వానం పంపారు. అందులో జగన్ కూడా ఉన్నారు. తర్వాత అందరికీ ఫోన్లు కూడా చేశారు. జగన్‌కూ చేశారు.
కానీ ఈ రోజు వరకు తమకు ఎలాంటి ఆహ్వానం లేదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కలిశారు. అదే సమయంలో రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై విపక్షాలు సమావేశం అవడంతో జాతీయ మీడియా విజయసాయిరెడ్డిని సమావేశానికి వెళ్తున్నారా అని ప్రశ్నించింది. తమకు ఆహ్వానం లేదని ఆయన చెప్పారు. కానీ వైసీపీ అడ్డంగా అబద్దాలు చెబుతోందని కాసేపటికే అసలు విషయం బయటకు వచ్చింది. మమతా బెనర్జీ జగన్‌కు రాసిన లేఖ వెలుగులోకి వచ్చింది.
ఆహ్వానం ఉన్నా లేదని ఎందుకు ప్రచారం చేసుకుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏకు మద్దతివ్వడానికి సిద్ధపడినందునే.. విపక్షాల భేటీకి హాజరయ్యే విషయంలో జగన్ వెనుకడుగు వేసినట్లుగా చెబుతున్నారు. అయితే అసలు ఆహ్వానమే రాలేదన్న విషయాన్ని ఎందుకు గోప్యంగా ఉంచారన్నది మాత్రం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కూడా అర్థం కాని విషయం.