ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురందేశ్వరి బాధ్యతలు చేపట్టిన తర్వాత వైసీపీ సర్కార్ ఆర్థిక అవకతవకలపై ఎక్కువగా మాట్లాడుతున్నారు. నిర్మలా సీతారామన్ కు కూడా ఫిర్యాదు చేశారు. అయితే వైసీపీ వైపు నుంచి గుడివాడ అమర్నాథ్ మాత్రమే స్పందిస్తున్నారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాత్ రెడ్డి ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియడం లేదు. గతంలో ఆయన అప్పుల కోసం ఢిల్లీలో ఎక్కువగా ఉండేవారు. ఇప్పుడు తన వల్ల కాదని చెప్పేశారేమో కానీ ప్రెస్ మీట్లు పెట్టే అవకాశం కూడా ఇవ్వడం లేదు.
బీజేపీ చేస్తున్న విమర్శలకు గట్టి గా కౌంటర్ ఇవ్వలేని పరిస్థితుల్లో వైసీపీ పడిపోయింది. గుడివాడ అమర్నాథ్ కు తన శాఖ పరిశ్రమల విషయంలోనే బేసిక్స్ తెలియవు.. విచిత్రంగా మాట్లాడి ట్రోల్ అవుతూంటారు. ఇక ఆర్థిక వ్యవస్థ .. అప్పులు గురించి మాట్లాడే పరిస్థితి లేదు. కానీ ఆయనకే చెబుతున్నారు. ఆయన అసలు విషయం చెప్పకుండా గత ప్రభుత్వం అని.. అప్పులని.. మాట్లాడుతున్నారు. అప్పులు చేసి ప్రజలకే పంచుతామని స్పందిస్తున్నారు. ఆయన మాటల్ని ఎవరూ సీరియస్ గా తీసుకోవడం లేదు. పైగా ఆయనది ఆర్థిక శాఖ కూడా కాకపోవడం మరో కారణం.
అమిత్ షా, జేపీ నడ్డా వచ్చి విమర్శలు చేస్తే వారిద్దరూ టీడీపీ ఇచ్చిన స్క్రిప్ట్ చదివారని ఆరోపించేశారు. కానీ పురందేశ్వరిని మాత్రం అలా అనలేకపోతున్నారు. ఎక్కువ ప్రాదాన్యం ఇవ్వకూడదని అనుకుంటున్నారో.. ఏమన్నా సరే.. కేంద్రం తమకు మద్దతుగా ఉంటుందని భరోసాతో ఉన్నారో కానీ.. లైట్ తీసుకుంటున్నారు.