పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతూ తనను ఎవరూ చూడలేదని అనుకుంటుంది. అచ్చంగా వైసీపీ రాజకీయ వ్యూహాలూ అంతే ఉన్నాయి. రాజ్యసభలో ఆ పార్టీ సభ్యులు వక్ఫ్ చట్టానికి అనుకులంగా ఓటేసినట్లుగా పార్లమెంట్ రికార్డులు చెబుతూంటే.. తాము మాత్రం వ్యతిరేకిచామని నమ్మించేందుకు కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా సుప్రీంకోర్టులో వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పిటిషన్ దాఖలు చేసినట్లుగా ఆ పార్టీ ప్రకటించుకుంది.
పార్లమెంట్ లో ఓటింగ్ అయిపోయి వారం రోజులు దాటిపోయింది. బిల్లు పాస్ అయిన రోజునే అసదుద్దీన్ ఓవైసీ సహా చాలా మంది పిటిషన్లు వేశారు. తాజాగా తమిళనాడులో టీవీకే అధ్యక్షుడు విజయ్ కూడా పిటిషన్ వేశారు. ఇప్పుడు పిటిషన్ వేస్తే.. ఆ బిల్లును వ్యతిరేకించినట్లుగా జనం నమ్ముతారని.. ఇదే మంచి చాన్స్ అనుకుని వైసీపీ కూడా రంగంలోకి దిగిపోయింది. పిటిషన్ వేసినట్లుగా చెప్పుకొచ్చింది.
పార్లమెంట్ ద్వారా చట్టం అయి.. రాజ్యాంగబద్ధంగా ఉన్నప్పుడు కోర్టు కూడా ఆ చట్టాన్ని సమీక్షించడానికి అవకాశం ఉండదు. ఈ విషయం తెలియక కాదు. కానీ ముస్లింలకు తాము ఎతో మేలు చేయాలనుకున్నామని.. ఆ చట్టాన్ని వ్యతిరేకించామని నమ్మించడానికి చేస్తున్న ఓ వింత ప్రయత్నం ఈ పిటిషన్. ముస్లింలు వైసీపీని నమ్ముతారా లేదా అన్నది పక్కన పెడితే ప్రజల్ని తక్కువ గా అంచనా వేస్తూ.. పిల్లి కళ్లు మూసుకున్న తరహా రాజకీయాలు చేయడం మాత్రం వైసీపీకే చెల్లుతుంది.