వైకాపాకి చెందిన 17 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి చంద్రబాబు నాయుడు ఇంతవరకు మొత్తం రూ.500 కోట్లు ఖర్చు చేసారని సాక్షి లెక్కలు గట్టి చెప్పింది. అదికాక తెదేపాలో చేరే ఎమ్మెల్యేలకి రాజధానిలో భూములు, వివిద ప్రాజెక్టులలో కాంట్రాక్టులు కూడా కట్టబెడుతోందని వైకాపా నేతలు భావిస్తున్నట్లు పేర్కొంది. తాజాగా తెదేపాలో చేరుతున్న వైకాపా ఎమ్మెల్యే యస్వీ మోహన్ రెడ్డికి రూ.30 కోట్లు ప్లస్ భూములు, కాంట్రాక్టులు ఇస్తున్నట్లు పేర్కొంది. చంద్రబాబు నాయుడు రెండేళ్ళ పరిపాలనలో అవినీతి మార్గాలు ద్వారా లక్షల కోట్లు సంపాదించారని, ఆ డబ్బుతోనే వైకాపా ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లాగా కొంటున్నారని వైకాపా నేతలు భావిస్తున్నట్లు సాక్షి పేర్కొంది.
చంద్రబాబు నాయుడు ఒక్కో ఎమ్మెల్యేకి రూ.30 కోట్లు చెల్లించి పట్టుకొనిపోతున్నట్లు వైకాపా కనిపెట్టినప్పుడు, తన చేతిలో ఉన్న బలమయిన సాక్షి మీడియాని ఉపయోగించుకొని స్టింగ్ ఆపరేషన్ నిర్వహించి తెదేపాను రెడ్ హ్యాండ్ గా పట్టుకొని చూపించవచ్చు. పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల చేత తమకి తెదేపా రూ.20 కోట్లు..30 కోట్లు…40 కోట్లు ఆఫర్ చేసిందని చెప్పిస్తోంది తప్ప ఇంతవరకు ఒక్క సాక్ష్యాధారం కూడా చూపలేకపోయింది. కనుక దాని ఆరోపణలు నమ్మలేని పరిస్థితి. అయినప్పటికీ వైకాపా తన ఆరోపణలు చేయడం మానుకోలేదు. దాని వలన పార్టీలో మిగిలిన ఎమ్మెల్యేలకి కూడా పార్టీ వీడితే ఏమేమి ప్రయోజనాలు పొందవచ్చో జగన్మోహన్ రెడ్డి స్వయంగా వివరించి చెపుతున్నట్లే అవుతోంది. దాని వలన పార్టీకి ఇంకా ఎక్కువ నష్టం కలుగుతోంది.
వచ్చే ఎన్నికలలోగా వైకాపాని పూర్తిగా ఖాళీ చేసేస్తామని తెదేపా నేతలు బహిరంగంగానే చెపుతున్నారు. కనుక జగన్మోహన్ రెడ్డి, ఆయనకు అత్యంతవిశ్వసనీయమయిన ఓ నలుగురైదుగురు ఎమ్మెల్యేలు మాత్రమే పార్టీలో మిగులుతారనుకొంటే, వైకాపా నుంచి ఇంకా మరో 45 మంది ఎమ్మెల్యేలను కొనవలసి ఉంటుంది. ఒకవేళ సాక్షి చెపుతున్న లెక్కలు నిజమనుకొంటే వారి కోసం చంద్రబాబు నాయుడు చాలా భారీ మొత్తం ఖర్చు చేయవలసి ఉంటుంది.
ఈ విషయంలో చంద్రబాబు కూడా చాలా పొరపాట్లే చేస్తున్నారని చెప్పక తప్పదు. తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి, ప్రజారంజకంగా పరిపాలిస్తే సరిపోయేది. కానీ రాష్ట్రంలో వైకాపాని లేకుండా చేయడం ద్వారా తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలనుకోవడం చాలా తప్పు. ఆ ఆలోచనని ప్రజాస్వామ్యవాదులేవరూ హర్షించలేరు. ఆమోదించరు కూడా. రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేసుకోవడానికే చంద్రబాబు నాయుడు అంత ఖర్చు, రిస్కు తీసుకొంటున్నారనుకొన్నా ఇప్పుడు పార్టీలోకి వస్తున్నవాళ్ళందరికీ వచ్చే ఎన్నికలలో టికెట్స్ ఈయలేకపోతే మళ్ళీ వాళ్ళు వెనక్కో లేకపోతే వేరే పార్టీలోకో వెళ్లిపోరనే నమ్మకం ఏమిటి? అని ఆలోచిస్తే ఆయన వృధాగా ప్రయాసపడుతున్నట్లు అర్ధమవుతుంది.
తన ప్రభుత్వం సాధిస్తున్న అభివృద్ధిని చూసే వైకాపా ఎమ్మెల్యేలు తెదేపాలో చేరుతున్నారని చెప్పుకోవడం ఆత్మవంచనే అవుతుంది. అదే నిజమయితే పార్టీలో చేరిన వారి చేత రాజీనామాలు చేయించి, మళ్ళీ ఎన్నికలకి వెళ్లి తన ప్రభుత్వానికి ప్రజలలో మంచి ఆదరణ, తన పాలన పట్ల చాలా సంతృప్తి కలిగి ఉన్నారని రుజువుచేసుకోవచ్చు. కానీ ఆవిధంగా చేయడానికి సిద్దపడటం లేదంటే తన పాలనపై తనకే నమ్మకం లేకపోవడం వలన కావచ్చు లేదా తీవ్ర అభద్రతాభావం వలన కావచ్చు.