సుమారు రెండేళ్ళ క్రితం వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర విభజనని వ్యతిరేకిస్తూ సమైక్యాంద్రకి అనుకూల వైఖరి తీసుకొన్నప్పుడు తెలంగాణాలో కొండా సురేఖ వంటి సీనియర్ నేతలు పార్టీని వీడి వెళ్ళిపోయారు. రాష్ట్రంలో చాలా చోట్ల వైకాపా కార్యాలయాలు మూతబడ్డాయి. పార్టీ జెండా దిమ్మలు పగిలాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తెలంగాణాలో ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ కర్నూలులో నిరాహార దీక్షకి కూర్చోగానే తెలంగాణాలో మళ్ళీ అవే సీన్లు మళ్ళీ పునరావృతం అవుతున్నాయి. జగన్ దీక్షకి బయలుదేరిన మరుక్షణమే తెలంగాణా పార్టీ కార్యదర్శి ఎడ్మ కిష్టారెడ్డి పార్టీని విడిచిపెట్టారు.
ఓ.యు.జెఎసి విద్యార్ధులు కొందరు ఇవ్వాళ్ళ హైదరాబాద్ లో ఉప్పల్ ప్రాంతంలో జగన్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి తమ నిరసనలు తెలిపారు. అక్కడే ఉన్న వైకాపా జెండా దిమ్మను కూడా కూల్చి వేశారు. మహబూబ్ నగర్ లో తెరాస కార్యకర్తలు వైకాపా కార్యాలయంపై దాడి చేసి పార్టీ జెండాను, పార్టీ బోర్డును తొలగించారు. ఆ సందర్భంగా స్థానిక వైకాపా కార్యకర్తలకు, తెరాస కార్యకర్తలకు మధ్య కొంత వాదోపవాదాలు కూడా జరిగాయి. ‘మీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తెలంగాణాలో ప్రాజెక్టులను వ్యతిరేకిస్తుంటే మీరు ఇంకా ఆ పార్టీలో ఎందుకు ఉన్నారు?’ అని తెరాస కార్యకర్తలు వారిని ప్రశ్నించారు.
జగన్ బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకొన్నారో లేక యధాప్రకారం తొందరపాటుతో తీసుకొన్నారో తెలియదు కానీ దాని ప్రభావం మాత్రం తెలంగాణా వైకాపాపై చాలా స్పష్టంగా కనబడుతోంది. జగన్ కూడా చంద్రబాబు నాయుడులాగే తెలంగాణాలో పార్టీని వదులుకోవడానికి సిద్దపడ్డారా? అంటే లేదనే భావించవలసి ఉంటుంది. ఎందుకంటే సరిగ్గా వారం రోజుల క్రితమే ఆయన పార్టీకి కొత్త అధ్యక్షుడుని, కార్యవర్గాన్ని ఏర్పాటు చేసారు. తెలంగాణా ప్రాజెక్టులని వ్యతిరేకిస్తూ తను నిరాహార దీక్ష చేసినట్లయితే, పార్టీ నేతలకి, కార్యకర్తలకి చాలా ఇబ్బందికర పరిస్థితులు, పార్టీకి నష్టం జరుగుతుందని జగన్ కి తెలియదనుకోలేము. అయినా చేస్తున్నారంటే బహుశః తెలంగాణాలో పార్టీని వదులుకోవడానికి సిద్దం అవుతున్నారేమోనని అనుమానించక తప్పదు.
ఓటుకి నోటు కేసు కారణంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాజెక్టులు, నీళ్ళ పంపకాల గురించి తెలంగాణా ప్రభుత్వంతో గట్టిగా పోరాడలేకపోతున్నారు కనుక తాను మాత్రమే తెలంగాణా ప్రభుత్వంతో నిర్భయంగా పోరాడగలనని ఆంధ్రా ప్రజలకు నిరూపించి చూపడానికే జగన్ దీక్షకు కూర్చొన్నారేమో? అందుకోసం తెలంగాణాలో తన పార్టీని పణంగా పెట్టడానికి సిద్దపడుతున్నారేమో? తెలంగాణాలో పార్టీని పణంగా పెట్టడం వలన ఆయనకు కొత్తగా వచ్చే నష్టమేమీ లేదు కానీ తెలంగాణాలో ఉన్న తన, తన కుటుంబ సభ్యుల ఆస్తులను పణంగా పెట్టలేరు కదా? ఏమయినప్పటికీ, తెలంగాణా విషయంలో జగన్ ఈసారి చాలా తెగించినట్లే ఉన్నారు. దాని పరిణామాలు ఏవిధంగా ఉంటాయో చూడాలి.