” ప్రాణాలు పోతూంటే పట్టించుకోలేదు.. కేసుల పాలైతే… వారితో తమకు సంబంధం లేదని లెటర్లు రాశారు. వారిద్దరూ చచ్చిపోతే… రెండూ ఫోటోలకూ కలిపి ఒకటే దండ వేసి .. . ,సోషల్ మీడియా వారియర్స్ ” అని చెప్పి స్మరించుకుంటున్నారు … ఇదేం పద్దతి అని.. వైసీపీ మాజీ సోషల్ మీడియా సైనికులు గత రెండు, మూడు రోజుల నుంచి సజ్జల భార్గవ్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. సజ్జల భార్గవ ఇప్పుడు సోషల్ మీడియా సైనికులకోసం వెదుక్కుంటున్నారు. ఇందు కోసం నగరాల్లో ఏర్పాటు చేస్తున్న సమావేశాల్లో శ్యామ్ కలకడతో పాటు చచ్చిపోయిన మరో సోషల్ మీడియా వారియర్ ఫోటోకు సింగిల్ దండను సగం సగం కవర్ చేసేలా వేస్తున్నారు. ఆ తర్వాత తమ ఉపన్యాసాలు ప్రారంభిస్తున్నారు.
లక్ష మంది వైసీపీ సైనికుల్ని ఏర్పాటు చేసుకుంటామని సజ్జల భార్గవ చెబుతున్నారు. అయితే ఏంటి… వైసీపీకి లక్ష మంది కూడా సోషల్ మీడియా సైన్యం లేదా అని ఎక్కువ మంది ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే… ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీ సోషల్ మీడియాలో లక్ష కాదు.. ఐదు లక్షల సైన్యం ఉండేది. స్వచ్చందంగా పని చేసేవారికి లెక్కే లేదు. అలాంటి వారందరూ కష్టపడి అధికారం సాధించడంలో భాగం అయ్యారు. అలా పని చేసిన వారంతా ఏమయ్యారు ? అనే ప్రశ్న సహజంగానే వస్తుంది. ఏమవుతారు.. శ్యామ్ కలకడగా ప్రాణాలు కోల్పోయారు లేదా కేసుల పాలై ఆత్మహత్యలు చేసుకున్నారు. లేకపోతే… వైసీపీకి పని చేయడం కన్నా… మన పని మనం ఏదో చేసుకోవడం మంచిదన్ని భావనతో సైలెంట్ అయ్యారు.
వైసీపీ సోషల్ మీడియాలో ఇప్పుడు పెయిడ్ ఆర్టిస్టులే ఉన్నారు. పెయిడ్ కోసం అయినా పని చేసే వారు తగ్గిపోయారు. అందుకే సజ్జల బార్గవ సోషల్ మీడియా సమావేశాలు పెడుతున్నారు. కానీ ఆ సమావేశాలకు ఇతరులు ఎవరూ రావడం లేదు. తమ పార్టీ కార్యకర్తలే వస్తున్నారు. కొత్తగా వాళ్లను రిక్రూట్ చేసుకునేది ఏమీ లేదు. అయినా లక్ష మందిని రెడీ చేసుకుంటామని.. పార్టీ పెద్దలకు తెలిసేలా చెబుతున్నారు. ఇలాంటి దుస్థితి ఎందుకు వచ్చిందో పైవాళ్లు కూడా ఆలోచించలేకపోతున్నారు. ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసే టైప్ కాబట్టి.. వారికి అంత తీరిక ఉండటంలేదు.