వైఎస్ సునీతను ఎంత త్వరగా టీడీపీలో చేర్పిద్దామా అని వైసీపీ నేతలు కంగారు కంగారుగా కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రొద్దుటూరులో టీడీపీలో చేరబోతున్న సునీతకు శుభాకాంక్షలు అని పోస్టర్లు వేసేశారు. అయితే ఆ పోస్టులు తామే వేశామని చెప్పుకోవడానికి వేసిన వాళ్లు సిగ్గుపడ్డారు. ప్రొద్దుటూరు పట్టణంలోని ప్రధాన కూడళ్లు అయిన ఎర్ర మునిరెడ్డి కాలనీ, హోమస్ పేట, మున్సిపల్ పార్కు, వివేకానంద క్లాత్ మార్కెట్ కూడళ్లలో ఈ పోస్టర్లు దర్శనమిచ్చాయి. అయితే సంప్రదాయంగా టీడీపీ నేతలు వేసే పోస్టర్ల తరహాలో ఇవి లేవు. కావాలని ఫేక్ పోస్టర్లు తయారు చేశారని సులువుగానే అర్థమైపోతుంది.
వైఎస్ సునీత రాజకీయంగా పోటీలోకి వస్తారని వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పటికే ఆమె టీడీపీలో చేరుతారని..టీడీపీ అధ్యక్షుడ్ని కలిశారని ఆరోపించారు. అయితే రాజకీయంగా ఇంత వరకూ సునీత ఎలాంటి ప్రకటనలు చేయలేదు. ఆమె రాజకీయాలపై ఆసక్తి ఉన్నట్లుగా ప్రకటించలేదు. ప్రముఖ వైద్యురాలు అయిన ఆమె.. హైదరాబాద్లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో పని చేస్తున్నారు. ఓ వైపు వివేకా హత్య కేసులో న్యాయం కోసం పోరాడుతూనే మరో వైపు .. విధులకూ హాజరవుతున్నారు. రాజకీయంగా ఎవరు వచ్చినా ఆమె కలిసేందుకు ఆసక్తి చూపరని అంటున్నారు.
మరి ఎవరు సునీత తెలుగుదేశం పార్టీలో చేరుతారని పోస్టర్లు వేశారన్నది మాత్రం సస్పెన్స్ గా మారింది. ఇదంతా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే చిల్లర తెలివితేటలని టీడీపీ నేతలు మండి పడుతున్నారు. టీడీపీ నేతలు పోస్టర్లు వేస్తే.. వారు ఆ విషయాన్ని చెప్పుకుంటారు.. కానీ ఎవరుపోస్టర్లు వేశారో ఎవరికీ తెలియదు. అదీ కాకుండా అసలు ఒక్క ప్రొద్దుటూరులోనే ఎందుకు పోస్టర్లు వేశారనేది కీలకంగా మారింది.