ఏపీలో ఇక ప్రభుత్వ ఆస్తులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులు వేయబోమని హైకోర్టులో సర్కార్ ప్రమాణపత్రం దాఖలు చేసింది. ఇప్పటి వరకూ వేసిన రంగులన్నీ తీసేస్తున్నామని.. ఇక ముందు ఆ తప్పు జరగబోదని పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేదీ స్వయంగా హైకోర్టుకు తెలిపారు. టీడీపీ హయాంలో చెత్త నుండి సంపద తయారీ అంటూ వర్మీ కంపోస్ట్ కేంద్రాలను నిర్మించారు. ఇటీవల అధికారులు వాటికి వైసీపీ రంగులేశారు. దీనిపై హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.
విచారణ జరిపిన హైకోర్టు ఇదేం పద్దతని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రంగులు తీసేయాలని… ఇక ముందు వేయమని అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు ఇచ్చిన గడువు చివరి రోజు రావడంతో ప్రమాణపత్రం దాఖలు చేశారు. రంగులు తీసేశామని.. ఇక ఏ ప్రభుత్వ భవనానికీ రంగులు వేయబోమని ప్రమాణం చేసింది. గతంలో పంచాయతీ భవనాలపై రంగులు వేసిన అంశంలోనూ సుప్రీంకోర్టు వరకూ పిటిషన్ల మీద పిటిషన్లు వేసిన ఏపీ ప్రభుత్వం చివరికి రంగులు తీయాల్సిందేనని తేల్చి చెప్పడంతో వెనక్కి తగ్గక తప్పలేదు.
మరోసారి అలాంటి పరిస్థితి ఏర్పడకుండా హైకోర్టు చెప్పిన వెంటనే రంగులు తీసేయడమే కాకుండా ఇక ముందు భవిష్యత్లో వేయబోమని కూడా ప్రమాణపత్రం దాఖలు చేశారు. కోర్టు తీర్పులను ఏ మాత్రం లెక్క చేయకుండా ఇలా వ్యవహరించడంపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకునే ప్రమాదం ఉండటంతో ఉన్నతాధికారులు హడావుడిగా ఈ అఫిడవిట్ దాఖలు చేసినట్లుగా భావిస్తున్నారు.