పదేళ్ళ పాటు ప్రతిపక్ష బెంచీలలో కూర్చొన్న తెదేపా అధికారంలోకి రావడం కోసం గత ఎన్నికలలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకొనేందుకు అనేక హామీలు గుప్పించింది. అది కోరుకొన్నట్లుగానే అధికారంలోకి రాగలిగింది కానీ ప్రజలకిచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయింది. పంట రుణాలు తదితర హామీలపై జగన్ ఉద్యమించారు. కాపులకు ఇచ్చిన హామీల కోసం ముద్రగడ ఉద్యమించవలసి వచ్చింది. అప్పుడే ప్రభుత్వం దిగివచ్చి హామీలను అమలు చేయడం మొదలుపెట్టింది.
అధికారంలోకి రావడం కోసం ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వడం ఒక పెద్ద పొరపాటు. అధికారంలోకి వచ్చేక వాటిని అమలుచేయకపోవడం మరొక పొరపాటు. వాటి కోసం ఒక్కో వర్గం వారు ఉద్యమిస్తుంటే ప్రభుత్వం వారికి లొంగి హామీలను అమలుచేయడం మరో పొరపాటు. అధికారంలో లేనప్పుడు అది సంపాదించుకోవడానికి, ఉన్నప్పుడు దానిని నిలబెట్టుకోవడానికి రాజకీయ పార్టీలు ఈవిధంగా ఆర్ధిక క్రమశిక్షణ ఉల్లంఘిస్తుంటే, దాని వలన అంతిమంగా నష్టపోయేది రాష్ట్రము, ప్రజలే తప్ప రాజకీయ పార్టీలు కాదు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వద్ద అభివృద్ధి, సంక్షేమ పనులను చేపట్టేందుకు డబ్బు లేని కారణంగా కేంద్ర సహాయం కోసం ఎప్పుడూ ఎదురు చూస్తుంటుంది. అటువంటప్పుడు రాష్ట్రంలో ఒక వర్గం వారు ఉద్యమించి, ఒత్తిడి చేయగానే బడ్జెట్ లో కేటాయింపులు చేసి, వందల కోట్ల రూపాయలు రుణాలుగా పంచిపెట్టేస్తుంది. అది చూసి మరొకవర్గం వారు కూడా ప్రేరణ పొంది, తాము కూడా ఉద్యమిస్తే తప్ప ప్రభుత్వం దిగిరాదని ఉద్యమాలు మొదలుపెడితే రాష్ట్రం, ప్రభుత్వం పరిస్థితి ఏమిటి? అప్పుడు వారికిచ్చిన హామీల కోసం ఎక్కడి నుంచి డబ్బు తెస్తుంది? తెదేపా ఇచ్చిన హామీలకు కేంద్రం ఎలాగూ బాధ్యత వహించదు కనుక, వేరే వర్గానికి లేదా అభివృద్ధి పనులకు కేటాయించిన డబ్బునే తీసి ఇవ్వవలసి వస్తుంది. అంటే ఒక వర్గానికి న్యాయం చేయాలంటే మరొకటి లేదా రాష్ట్రం నష్టపోవలసి ఉంటుందన్న మాట.
ఇప్పుడు విషయంలోకి వస్తే, ముద్రగడ ఒత్తిడి కారణంగా కాపులకు రుణాల పంపిణీ మొదలయింది. వారికి రిజర్వేషన్లు కల్పించేందుకు కసరత్తు కూడా మొదలయింది కనుక, మిగిలిన వర్గాల వారు కూడా తమ హక్కుల కోసం, తెదేపా ఇచ్చిన హామీల అమలు కోసం పట్టుబట్టవచ్చును. ఒకవేళ వారు ప్రభుత్వంతో పోరాటానికి సిద్దం కాకపోయినట్లయితే, వారిని రెచ్చగొట్టడానికి వైకాపా ఉండనే ఉంది.
బహుశః ఆ ప్రయత్నంలోనే ఆ పార్టీ నేత ధర్మాన ప్రసాద రావు బీసిల సంక్షేమానికి తెదేపా ఇచ్చిన హామీని గురించి గుర్తు చేసారు. “బీసిలకు ఏడాదికి రూ.10,000 కోట్లు కేటాయిస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చేరు. కానీ మొదటి బడ్జెట్ లో కేవలం రూ.2,500, తరువాత రూ.3,975, ఈ సంవత్సరం రూ.6,460 కోట్లు కేటాయించడం గమనిస్తే, ఈ విషయంలో చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధి ఏమిటో అర్ధం అవుతుంది. నోటికి వచ్చినట్లు హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన ఆయన, ఆ తరువాత వాటిని గాలికొదిలేసి మళ్ళీ ప్రజలను మోసం చేస్తున్నారు. బీసిల సంక్షేమం గురించి గొప్పగా ప్రసంగాలు చేయడం కాదు వారికిచ్చిన హామీలను అమలుచేయాలి,” అని ధర్మాన ప్రసాదరావు అన్నారు. బహుశః దీని కోసం వైకాపా ఉద్యమించడానికి సిద్దం అవుతోందేమోనని అనుమానించవలసి వస్తోంది.
అధికారంలోకి రావడానికి ఒక పార్టీ ఆచరణ సాధ్యం కాని హామీలను గుప్పిస్తే, దానిని ఇరుకున పెట్టి రాజకీయంగా దెబ్బ తీయడానికి ప్రతిపక్ష పార్టీ ఆ హామీల అమలుకి పట్టుబడుతోంది. వారి ఈ రాజకీయ చదరంగంలో ప్రజలలో వివిధ వర్గాలను పావులుగా వాడుకొంటూ ఆడుకొంటుంటే చివరికి ప్రజలే నష్టపోతున్నారు. అధికారంలోకి రావడం కోసం రాజకీయ పార్టీలు ఆనాలోచితంగా హామీలు ఇవ్వడం వలననే ఈ సమస్య తలెత్తిందని అర్ధం అవుతోంది.