ఇప్పటంలో చేసింది తప్పుడు పని దాన్ని సమర్థించుకోవడానికి వైసీపీ.. ప్రభుత్వం చేస్తున్న పనులు అన్నీ ఇన్నీ కావు. రచ్చ జరుగుతున్నప్పుడు.. మా ఇళ్లు కూల్చివేయడం మాకు ఆనందమే అని.. ఎవరూ లేని నిర్మానుష్య ప్రాంతంలో వీడియోలు చేయించి సాక్షి మీడియా అభాసు పాలైంది. తాజాగా ప్రభుత్వ పెద్దలు మరో విచిత్రమైన ఆలోచన చేశారు. మా ఇళ్లను ప్రభుత్వం కూల్చలేదు. మీరు రాజకీయం చేయవద్దు అని చిన్న బ్యానల్ ఫ్లెక్సీలను కొన్ని ఇళ్ల ముందు ఏర్పాటు చేశారు. నాలుగు ఇళ్ల ముందు ఏర్పాటు చేసి.. వాటిని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు.
ఇప్పటం గ్రామస్తులు ఇలా చెబుతున్నారని..ఫ్లెక్సీలు పెట్టుకున్నారని.. ప్రభుత్వ ఎవరి ఇళ్లు కూల్చలేదని వాదిస్తున్నారు. ఈ ఫ్లెక్సీలు పెట్టిన తర్వాత సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెరపైకి వచ్చి ఇప్పటంలో కూల్చివేత జరిగింది అబద్దమని చెప్పుకొచ్చారు. స్పష్టంగా కళ్ల ముందు కనిపిస్తున్న దాన్ని కూడా ఇలా అడ్డగోలుగా వాదించడం ఒకటైతే.. అసలు బాధితుల ఇళ్ల ముందే.. బలవంతంగా … తమ ఇళ్లను ప్రభుత్వం కూల్చలేదని ఫ్లెక్సీలు కట్టించి ఫోటోలు తీయించి సోషల్ మీడియాలో ప్రచారం చేయడం మరింత రాద్దాంతం.
ప్రజలు ఏమనుకుంటారోనన్న కనీస ఇంగితం కూడా వైసీపీ లేదని.. ఈ ఫ్లెక్సీలు.. పోస్టర్లు చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. కానీ ఎవరినో నమ్మించాలని.. ఇలాంటి ప్రయత్నాలు చేయడం నవ్వుల పాలవుతోంది. ఇప్పటం వ్యవహారం వైసీపీకి పూర్తి స్థాయిలో డ్యామేజ్ అయింది. ఈ విషయాన్ని వైసీపీ గుర్తించింది. కానీ ఇలా పోస్టర్లు వేసుకోడం మాత్రం డ్యామేజ్ను కంట్రోల్ చేయకపోగా మరింత పెంచుకుంది. ఇలా సలహాలిస్తున్న వారెవరో కానీ వైసీపీకి ఎప్పుడూ లేనంత నష్టం చేస్తున్నారు.