ప్రజా సంక్షేమం గురించి కంటే, పక్క పార్టీవాళ్లని తిట్టడానికే వైకాపా నేతల నోళ్లు ఎక్కువగా లేస్తుంటాయి. ఎన్ని ఎక్కువ బూతులు వస్తే, అంత పెద్ద నేత అన్నట్టు తయారైంది ఆ పార్టీ. ఈ క్వాలిఫికేషన్‌తోనే మంత్రి పదవి దక్కించుకొన్న ప్రబుద్ధులూ ఉన్నారు. ముఖ్యంగా పవన్ కల్యాణ్‌ని తిట్టడానికే కొంతమందికి పదవులు కట్టబెట్టారు. ఇప్పుడు జనసేన – టీడీపీ ఎలయెన్స్.. వైకాపాలో కలవరం రేపుతోంది. రెండు పార్టీలూ కలిస్తే వైకాపా మనుగడ డౌటే అనేది వాళ్లకూ తెలుసు. వచ్చే ఎన్నికల్లో కనీసం గౌరవప్రదమైన సీట్లయినా వైకాపా దక్కించుకొంటుందా అనేది అనుమానమే. అందుకే రెండు పార్టీల్లో చిచ్చు పెట్టడానికి వైకాపా నేతలు గట్టిగా ప్రయత్నిస్తున్నారు.
మరోవైపు పవన్ కల్యాణ్‌ని వ్యక్తిగతంగా దూషించడం కోసం కొత్త మొహాల్ని అన్వేషిస్తోంది వైకాపా. గతంలో పోసాని లాంటి వాళ్లని మీడియా ముందు కూర్చోబెట్టి పవన్‌ని పనిగట్టుకొని మరీ దూషించిన వైనం గుర్తుండే ఉంటుంది. ఆయన మీడియా ముందుకు వచ్చిన ప్రతీసారీ హద్దులు మీరి మరీ మాట్లాడడం, చిరంజీవిని సైతం ఈ రొంపిలోకి లాగడం తెలిసిన విషయాలే. ఇప్పుడు ఈ డోసుని ఇంకాస్త పెంచాలన్న ఆలోచనలో ఉంది వైకాపా. రోజా, శ్రీరెడ్డి, పోసాని లాంటి వాళ్లు మరీ రొటీన్ అయిపోయారని, అస్తమానూ పవన్ పెళ్లిళ్ల గురించి ప్రస్తావిస్తే.. జనంలో మరింత చులకన అయిపోవడం ఖాయమని వైకాపాకు కూడా తెలుసు. పవన్‌ని తిట్టడానికి కొత్త మొహాలు కావాలని భావిస్తున్నారు ఆ పార్టీ నేతలు. అందుకోసం అందుబాటులో ఎవరున్నారా? అంటూ ఫోకస్ మొదలెట్టారని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. గతంలో పవన్‌తో సన్నిహితంగా మెలిగిన ఒకరిద్దరు నటుల్ని ఈ ఎన్నికల ముందు రంగంలోకి దింపి, వాళ్ల ద్వారా పవన్‌ని వ్యక్తిగతంగా దూషించి, పవన్ క్యారెక్టర్ దిగజార్చేలా పన్నాగం పన్నుతున్నారని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో తాము గెలిస్తే… నామినేటెడ్ పదవులు ఇస్తామని చెప్పి మరీ ఎర వేస్తున్నార్ట. అయితే.. వైకాపా నేతల బుద్ధుల గురించి తెలిసిన వాళ్లెవరూ ఈ ఉచ్చులో చచ్చినా పడరు. గతంలో ఫృథ్వీని సైతం ఇలానే వాడుకొని, ఆ తరవాత వదిలేశారు. అందుకే మరో బకరా కావడం ఇష్టం లేక – వైకాపా ఆఫర్లకు ఎవరూ లొంగడం లేదు.