వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఆయనకి చెందిన రూ.750 కోట్లు విలువగల ఆస్తులని నిన్న ఈడి తాత్కాలికంగా అటాచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అది ఆయనకీ, ఆయన పార్టీ నేతలకి చాలా పెద్ద షాక్ అనే చెప్పవచ్చు. అది తెదేపా నేతలకి చాలా ఆనందం కలిగించే విషయమని చెప్పకతప్పదు. ఈ వార్త తెలియగానే మంత్రి రావెల కిషోర్ బాబు తదితరులు ఈడి చర్యలని స్వాగతిస్తూ జగన్మోహన్ రెడ్డి యావదాస్తిని స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. జగన్ నివాసం ఉంటున్న లోటస్ పాండ్ భవనాన్ని, సాక్షి టవర్స్ ని ఈడి స్వాధీనం చేసుకొందని, ఇక జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళడమే తరువాయి అన్నట్లుగా మాట్లాడుతున్నారు.
వారీవిధంగా మాట్లాడుతారని ముందే ఊహించి సాక్షిలో అటాచ్ మెంట్ అంటే ఆస్తులని స్వాధీనం చేసుకోవడం కాదు. వాటిపై క్రయవిక్రయాలు వగైరా ఎటువంటి లావాదేవీలు జరపకుండా నిరోధించడమేనని వివరిస్తూ ఒక ఆర్టికల్ ప్రచురించింది. కాంగ్రెస్, తెదేపా కుట్రల మూలంగానే జగన్ పై సిబిఐ కేసులు నమోదు అయ్యేయని, జగన్ నిర్దోషి అని అందులో వ్రాసుకోంది. ఇవ్వాళ్ళ మీడియాతో మాట్లాడుతున్న వైకాపా నేతలు ఏవిధంగా మాట్లాడాలో అది తెలియజెపుతున్నట్లుంది.
ఆ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మావతి మీడియాతో మాట్లాడుతూ, “జగన్ ఎటువంటి తప్పు చేయలేదని మేము భావిస్తున్నాము. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉంది కనుక దాని లోతుల్లోకి వెళ్ళను. తెదేపా నేతల విమర్శలకి జవాబు చెప్పేందుకే దీనిపై స్పందిస్తున్నాను. రాజకీయ కుట్రలో భాగంగానే జగన్ని ఈ కేసులలో ఇరికించారు. ఏదో ఒకరోజు జగన్ ఈ ఆరోపణలన్నీ అబద్ధమని నిరూపించడం ఖాయం. జగన్ కున్న ప్రజాదారణ చూసి ఓర్వలేకనే తెదేపా నేతలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. ఈ కేసులలో జగన్ లోటస్ పాండ్ నివాసాన్ని, సాక్షి కార్యాలయాన్ని ఈడి స్వాధీనం చేసుకొన్నారన్నట్లు తెదేపా నేతలు ప్రచారం చేస్తూ పైశాచికానందం పొందుతున్నారు. అయితే అటాచ్ మెంట్ అంటే ఆస్తుల స్వాధీనం కాదని వాటిపై ఎటువంటి క్రయవిక్రయాలు జరుపకుండా నిరోధించడమేనని తెదేపా నేతలకి తెలియదా? కానీ తెలిసీ వారు ఈవిధంగా ప్రచారం చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డిని ప్రజలకి దూరం చేయాలనే ఉద్దేశ్యంతోనే చేస్తున్నారని భావిస్తున్నాము. అధికారంలోకి వచ్చి రెండేళ్ళయిన తరువాత కూడా తెదేపా నేతలు ఇంకా జగన్ నామస్మరణతో తరించిపోతున్నారంటే వారి ప్రభుత్వం వైఫల్యం చెందినట్లే,” అని వాసిరెడ్డి పద్మా అన్నారు.
వైకాపా సీనియర్ నేత తమ్మినేని సీతారాం అయితే మరో అడుగు ముందుకు వేసి, “ఓటుకి నోటు కేసులో పట్టుబడిన చంద్రబాబు నాయుడుకి దేశ బహిష్కరణ, పట్టపగలు నడిరోడ్డుపై వివాహిత మహిళతో అసభ్యంగా ప్రవర్తించినందుకు మంత్రి రావెల కిషోర్ బాబు కుమారుడు రావెల సుశీల్ కి రాష్ట్ర బహిష్కరణ విధించాలని డిమాండ్ చేశారు. అటాచ్ మెంట్ కి స్వాధీనం చేసుకోవడానికి గల తేడా తెలుసుకోవాలని సూచించారు. ఒకే ఒక ఎఫ్.ఐ.ఆర్. ఆధారంగా ఏకంగా 11 చార్జ్ షీట్లు నమోదు చేయడం గమనిస్తే అది కక్ష సాధింపు చర్యతో చేసినదేనని అర్ధమవుతోందన్నారు.