మూడు రాజధానుల అంశం తమ చేతుల్లో లేదని వైసీపీ తేల్చేసింది. మూడు రాజధానులు చేస్తామంటూ ఇంత కాలం నుంచి చేస్తున్న హడావుడి ఉత్తదేనని తేలిపోయింది. రాజధానుల ఏర్పాటు పై ఆ రాష్ట్ర శాసనసభకు స్పష్టమైన అధికారం ఉండేలా రాజ్యాంగ సవరణ కోరుతూ విజయసాయి రెడ్డి రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టడంతో ఈ అంశంపై క్లారిటీ వచ్చింది. స్వయంగా వైసీపీనే తమ చేతుల్లో రాజ్యాంగ సవరణ అవసరమని పార్టీ ఎంపీ ద్వారా పార్లమెంట్‌కు తెలిపేలా చేసింది.
వచ్చే అసెంబ్లీ సమవేశాల్లో మరోసారి మూడు రాజధానుల బిల్లు పెడతామని వైఎస్ఆర్సీపీ నేతలు చెబుతున్నారు. మంత్రి అమర్నాథ్ పలుమార్లు ప్రకటించారు. కానీ అదంతా రాజకీయమే కానీ నిజానికి తమ చేతుల్లో లేదని ప్రైవేటు బిల్లు పెట్టడం ద్వారా స్పష్టం చేసినట్లయింది. బిల్లు సంగతి తేలే వరకూ మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెట్టడం సాంకేతికంగా కూడా సాధ్యం కాదు. పార్లమెంట్ చరిత్రలో ప్రైవేటు బిల్లులు చట్టంగా మారిన సందర్భాలు దాదాపుగా లేవు. సభ్యులు ప్రైవేటుగా పెట్టే బిల్లులు ఎప్పుడూ చట్టాలుగా మారవు.
పైగా విజయసాయిరెడ్డి పెట్టింది రాజ్యాంగ సవరణ బిల్లు. మామూలు బిల్లు వేరు.. రాజ్యాంగ సవరణ బిల్లు వేరు. రాజ్యాంగ సవరణకు మూడింట రెండు వంతుల మెజార్టీ కావాలి. కేంద్రంలో అధికారంలో ఉండే ప్రభుత్వమే ఈ స్థాయి మద్దతు కూడగట్టడం సాధ్యం కాదు. న్యాయ పరమైన వెసులుబాటు మూడు రాజధానులకు లేదు. అంటే చట్టం కూడా మళ్లీ చేయలేరు.పైగా రైతులు వేసిన పిటిషన్లపై ఇంకా విచారణ జరుగుతోంది.ఈ కోణంలోనూ బిల్లు పెట్టలేరు. కానీ ప్రజల్ని మభ్య పెట్టే రాజకీయం మాత్రం జోరుగా చేస్తున్నారు.