వైకాపా నుంచి తెదేపాలో చేరిన 16మంది ఎమ్మెల్యేలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ డా. కోడెల శివప్రసాద రావు పై వైకాపా శుక్రవారం సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ వేసింది. పార్టీ ఫిరాయించిన ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయమని విజ్ఞప్తి చేసినప్పటికీ స్పీకర్ కోడెల పట్టించుకోవడంలేదని, ఆ 16 మంది ఎమ్మెల్యేలు తమ పదవులకి రాజీనామాలు చేయకుండా నేటికీ వైకాపా సభ్యులుగానే కొనసాగుతున్నందుకు వారిపై పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం అనర్హత వేటు వేయాలని కోరుతూ వైకాపా ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించిన 9మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన విషయాన్ని మేకపాటి తన పిటిషన్ లో సుప్రీంకోర్టుకి గుర్తుచేసి, వైకాపా ఎమ్మెల్యేలపై కూడా అదే విధంగా చర్యలు తీసుకోవలసిందిగా కోరారు. ఆయన తన పిటిషన్ లో స్పీకర్ డా. కోడెల శివప్రసాద్ ని, తెదేపాలో చేరిన 16మంది ఎమ్మెల్యేలను ప్రతివాదులుగా పేర్కొన్నారు.
స్పీకర్ పరిధిలో ఉండే ఇటువంటి అంశాలలో సాధారణంగా న్యాయస్థానాలు జోక్యం చేసుకోవు. చేసుకొన్నా తమ పరిధి మేరకే కేసును విచారించవచ్చు. తెలంగాణాలో పార్టీ ఫిరాయించిన ప్రతిపక్ష ఎమ్మెల్యేల విషయంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకొనేందుకు ఇష్టపడలేదు. వారిపై తగిన నిర్ణయం తీసుకొంటే బాగుంటుంది అని మాత్రమే సూచిస్తూ రాష్ట్ర హైకోర్టు స్పీకర్ మధుసూధనచారికి లేఖ వ్రాసింది తప్ప, కోర్టుకి హాజరయ్యి సంజాయిషీ చెప్పుకోమని ఆదేశించలేదు. ఎందుకంటే అలాగ స్పీకర్ ని ఆదేశించే హక్కు న్యాయస్థానాలకు లేదు. కానీ ఉత్తరాఖండ్ కేసులో స్వయంగా స్పీకరే ఆ 9మందిపై అనర్హత వేటు వేశారు కనుక ఆయన నిర్ణయాన్ని హైకోర్టు,సుప్రీం కోర్టు సమీక్షించి సమర్ధించాయి.
ఆ కేసులో అనర్హత వేటుపడ్డ ఎమ్మెల్యేలు పెట్టుకొన్న పిటిషన్ పై సుప్రీం కోర్టు ఇంకా తుది తీర్పు వెలువరించలేదు. ఒకవేళ తుది తీర్పులో స్పీకర్ నిర్ణయంతో సుప్రీం కోర్టు విభేదించినా, చట్ట ప్రకారం ఆయన నిర్ణయాన్ని కొట్టివేయలేదు కనుక ఆ కేసులో కూడా తన పరిధి మేరకే స్పందించవచ్చు. వైకాపా ఎమ్మెల్యేల విషయంలో కూడా అదే జరుగుతుంది. ఈ విషయం వైకాపాకి కూడా తెలుసు. అయినా ఈ ఫిరాయింపులపై జాతీయస్థాయి మీడియాని, పార్టీలని ఆకర్షించి దానిపై కొంత చర్చ జరిగేలా చేయడానికే సుప్రీం కోర్టులో పిటిషన్ వేసి ఉండవచ్చు. రోజా సస్పెన్షన్ కేసుపై సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బలు తగిలినా దానిపై జరిగిన రాద్దాంతంతో వైకాపా అందరి దృష్టిని ఆకర్షించగలిగింది. ఈ కేసులో కూడా బహుశః ఆవిధంగానే ఎంతో కొంత మైలేజి పొందాలని ఆశపడుతోందేమో?