గడపగడపకు మన ప్రభుత్వాన్ని ఇక నుంచి స్ట్రిక్ట్‌గా వైసీపీ కార్యకర్తల ఇళ్లకే పరిమితం చేయాలని వైసీపీ నాయకత్వం అంతర్గత ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. నిజానికి కేవలం లబ్దిదారుల ఇళ్లకే వెళ్లాలని ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలిచ్చారు. గ్రామ, వార్డు సచివాలయాలు.. వాలంటీర్ల ద్వారా లబ్దిదారుల జాబితాలను ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జులు.. ఇతర నేతలకు పంపించారు. ఆ ప్రకారమే వారు గడపగడపకూ బయలుదేరారు. అయితే పథకాలు తీసుకున్న వారు కూడా రకరకాలుగా ప్రశ్నిస్తున్నారు. రూ. పదివేలు ఇచ్చి.. రూ. ఇరవై వేలు లాక్కుంటున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో మద్యం తాగేవారుంటే రియాక్షన్ మరో స్థాయిలో ఉంటోంది. ప్రభుత్వం మా రక్తం తాగుతోందని ఆ కుటుంబీకులు ఫైరవుతున్నారు.
తొలి రోజు గడపగడపలో మీడియా.. సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం మొత్తం తేడా కొట్టేసింది. ఎక్కవగా నెగెటివ్ ప్రచారమే జరిగింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అదే పరిస్థితి. ఇలాంటి పరిస్థితి ఎదురు కాకూడదనే చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. కొన్ని చోట్ల ప్రత్యేకంగా పథకాల వల్ల మేలు జరిగిందని.. మళ్లీ జగనే వస్తాడని చెప్పించి వీడియోలు కూడారిలీజ్ చేయించాలని ప్రయత్నించారు. ఆ ప్రయత్నం కూడా పెద్దగా సఫలం కాలేదు. దీంతో వైసీపీ హైకమాండ్ ప్లాన్ మార్చింది.
ఇక నుంచి ఎమ్మెల్యేలు కరుడుగట్టిన వైసీపీ కార్యకర్తల వద్దకే వెళ్లాలని.. వారు జగన్‌ను.. వైసీపీని విపరీతంగా పొగిడేలా చూసుకుని ఆ వీడియోలు మాత్రమే బయటకు వచ్చేలా చూసుకోవాలని ఆదేశించినట్లుగా తెలుస్తోంది. ఈమేరకు గడపగడపకూ మన ప్రభుత్వంలో గురువారం నుంచి మౌలికమైన మార్పులు వస్తాయి. పాల్గొనేవాళ్లు తగ్గిపోతారు. పాజిటివ్ రాకపోయినా ప్రజల్లో నెగెటివ్ ప్రచారం జరగకపోతే చాలని అనుకుంటున్నారు.