ఆంధ్రప్రదేశ్లో మొత్తం పధ్నాలుగు లక్షల ఇరవై ఐదు వేల బోగస్ రేషన్ కార్డులు ఉన్నాయని ప్రభుత్వం గుర్తించింది. ప్రత్యేకంగా నవశకం పేరుతో.. వాలంటీర్లతో నిర్వహించిన సర్వేలో ఈ లెక్క తేలింది. ఇంత పెద్ద ఎత్తున రేషన్ కార్డులు అనర్హుల వద్ద ఉన్నాయని గుర్తించినా… వాటిని తీసేసిన తర్వాత … ఉండే కార్డులు కోటి ఇరవై ఎనిమిది లక్షల తొంభై ఐదు వేలు. అంటే.. అక్షరాలా.. కోటి ఇరవై లక్షల రేషన్ కార్డులు ఉన్నాయన్నమట. ఆంధ్రప్రదేశ్లో ఉన్న కుటుంబాలు ప్రభుత్వ లెక్కల ప్రకారం.. 1,41,13,797 ఉన్నాయి. అంటే.. అనర్హుల్ని తీసేసిన తర్వాత రేషన్ కార్డు లేని.. కుటుంబాలు కేవలం పదకొండు లక్షలు మాత్రమే. అంటే ఆంధ్రప్రదేశ్లో 90 శాతానికిపైగా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారని భావించాల్సి వస్తుంది. కొసమెరుపేమిటంటే.. అనర్హుల్ని తీసేశారు కానీ.. కొత్తవి ఇవ్వలేదు. రేపు గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రారంభమైన తర్వాత కొత్త కార్డులు జారీ చేస్తారు.
ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇస్తున్న రేషన్ కార్డులు కాబట్టి.. వారి పార్టీకి చెందిన వారు ఎవరు వచ్చినా.. రేషన్ కార్డు మంజూరు చేయక తప్పదు. అంటే.. ఇప్పుడు తీసేసిన ఆ పధ్నాలుగు లక్షల రేషన్ కార్డులకు మరిన్ని అదనంగా వచ్చి చేరడం ఖాయం. నిబంధనల ప్రకారం రేషన్ కార్డులను దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారికి మాత్రమే మంజూరు చేయాలి. కానీ ప్రతి ప్రభుత్వ పథకానికి వైట్ రేషన్ కార్డు మాత్రమే అర్హతగా ప్రభుత్వ నిర్ణయిస్తూండటంతో.. ఎంత ఉన్నతమైన కుటుంబం అయినా.. భరోసా కోసం..తమకు ఉన్న పలుకుబడిని ఉపయోగించుకుని రేషన్ కార్డు పొందుతున్నాయి. అందుకే.. జగన్మోహన్ రెడ్డి సర్కార్.. ఈ రేషన్ కార్డు మాత్రమే అర్హతగా కాకుండా ప్రతీ పథకానికి ఓ కార్డు మంజూరు చేయాలని నిర్ణయించింది.
రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ, విద్యాదీవెన, పించన్ కానుక ఇలా అన్నింటికీ ఒక్కో కార్డు జారీ చేస్తారు. దీంతో.. రేషన్ కార్డులు పొందాలనే ఆలోచన ప్రజల్లో తగ్గిపోతుందని ప్రభుత్వం భావిస్తోంది. అయతే.. అన్నీ పక్కాగా అమలు చేస్తామని… అనర్హులకు పథకాలు అందనీయబోమని చెప్పుకొచ్చిన ప్రభుత్వం.. వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చింది. అయినప్పటికీ వాస్తవ లబ్దిదారులను మాత్రమే ఉంచడంలో విఫలమయింది. బహుశా.. ఈ పథకాలు అందకపోతే.. ప్రజాగ్రహం ఎదురవుతుందని భయపడి ఉండవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.