చంద్రబాబు భార్య భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేలు ,ప్రజాప్రతినిధులకు భద్రతను భారీగా పెంచారు. వల్లభనేని వంశీకి ఇప్పుడు వన్ ప్లస్ వన్ సెక్యూరిటీ ఉండేది. ఇప్పుడు ఏకంగా ఫోర్ ప్లస్ ఫోర్కు పెంచారు. చంద్రబాబు భార్య భువనేశ్వరిపై మొదట విమర్శలు, ఆరోపణలు ప్రారంభించింది గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీనే. ఆయన సాక్షి మీడియాకు ఓ సారి ఇంటర్యూ ఇచ్చి లోకేష్, ఆయన తల్లి భువనేశ్వరిపై అనుచితంగా మాట్లాడారు.
ఆ తర్వాత ఈ అంశాన్ని అసెంబ్లీలో అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కొడాలి నాని, వల్లభనేని వంశీ మాట్లాడారు. తన భార్యను కించ పరచడం తట్టుకోలేక చంద్రబాబు కన్నీరు పెట్టుకుని అసెంబ్లీకి రాబోనని సవాల్ చేశారు. భువనేశ్వరిని వైసీపీ నేతలు అన్న వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేగుతోంది. నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఈ కారణంగా ఆ మాటలన్నవారందరికీ భద్రత పెంచాలని పోలీసులు నిర్ణయించారు.
బెదిరింపులు వస్తున్నాయని అందుకే భద్రత పెంచుతున్నట్లుగా చెబుతున్నారు. గతంలో తీవ్రమైన ముప్పు ఉన్న టీడీపీ నేతలకు కూడా భారీగా సెక్యూరిటీని తగ్గించారు. ఇప్పుడు టీడీపీ నేతలు.. ఎన్టీఆర్ కుమార్తెపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారికి పెద్ద ఎత్తున సెక్యూరిటీ కల్పిస్తున్నారు.