గత ప్రభుత్వంలో శంకుస్థాపనలు చేసి పనులు ప్రారంభించిన వాటిని తాను రాగానే ఆపేసి.. మళ్లీ ఎన్నికలకు ముందు శంకుస్థాపనలు చేస్తున్న జగన్ రెడ్డి… మార్క్ రివర్స్ పాలనలో ఇప్పుడు బందరు పోర్టుది. బందరు పోర్టుకు మూడో సారి శంకుస్థాపన చేస్తున్నారు. గతంలో ఆయన తండ్రి వైఎస్ కూడా ఎన్నికలకు ఏడాది ముందు శంకుస్థాపన చేశారు. 2009 ఏప్రిల్లో సార్వత్రిక ఎన్నికలు జరగడానికి ఏడాది ముందు, 2008 ఏప్రిల్ 23న బందరు పోర్టుకు నాటి సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి శంకుస్థాపన చేశారు. పనులు మాత్రం సాగలేదు.
2019 ఫిబ్రవరి 7న నవ్యాంధ్ర సీఎం హోదాలో చంద్రబాబు బందరు పోర్టుకు శంకుస్థాపన చేశారు. దాదాపుగా ఐదు వందల కోట్ల రూపాయల పనులు కూడా జరిగాయి. కానీ… వైసీపీ సర్కారు దీనినీ ‘రివర్స్’ బాట పట్టించింది. ఇప్పుడు… ఎన్నికల ఏడాదిరాగానే మళ్లీ బందరు పోర్టు పేరిట హడావుడి మొదలుపెట్టింది. ఎన్నికలు మరో ఏడాదిలో జరగనున్నాయి. పోర్టు పనులను దక్కించుకున్న మేఘా సంస్థ ఇప్పటివరకు పోర్టు పనులను ఎక్కడా చేయలేదు. వివిధ ప్రాంతాల్లో భారీ నిర్మాణాలు చేసినా పోర్టు పనులు చేయడం ఇదే ప్రథమం. ఈ నేపథ్యంలో ఎంతవరకు మేఘా సంస్థ పోర్టు పనులను చేస్తుందనేది అనుమానంగా ఉంది.
నిజానికి పోర్టు పేరుతో ఇప్పటికే అప్పు తెచ్చేసి బటన్ నొక్కే పథకాలకు మళ్లించారన్న ప్రచారం జరుగుతోంది. మేరిటైమ్ కార్పొరేషన్ పేరుతో గుట్టుగా .. పోర్టుల నిర్మాణం కోసమని రుణాలు తీసుకున్నారు. చివరికి వాటిని మళ్లించేసారు. ఇప్పుడు పోర్టు కట్టడానికి డబ్బుల్లేవని.. ప్రభుత్వం ఇవ్వాల్సిందేనంటున్నారు. ఆ రుణాలు మేరిటైమ్ కార్పొరేషన్ పేరు మీదనే ఉన్నాయి. మేఘా పోలవరం ప్రాజెక్టును తీసుకుని పూర్తిగా పడకేసేలా చేసింది. ఇప్పుడు ఈ పోర్టును ఏం చేస్తారో చూడాల్సి ఉంది.