కాంట్రాక్టులు తీసుకుని పనులు చేసి బిల్లులు అడుగుతున్నారని ఫీలైపోతున్న ఏపీ ప్రభుత్వం ఇక నుంచి అలాంటి సమస్య రాకుండా టెండర్ పత్రాల్లోనే కొత్త షరతులు పెట్టింది. ప్రభుత్వాన్ని డబ్బులు అడగకూడదని స్పష్టం చేసింది. ప్రభుత్వం వద్ద డబ్బులున్నప్పుడు ఇస్తుందని ..అది కూడా పని పూర్తయినప్పుడేనని స్పష్టం చేసింది. డబ్బులు ఇవ్వాలని కోర్టుకు వెళ్లవద్దనేది రూల్స్‌లో మరొకటి. జలవనరుల శాఖలో కొన్ని పనుల కోసం ఇచ్చిన టెండర్లలో ఈ నిబంధనలు ఉండటం చూసి కాంట్రాక్టర్లు షాక్ కు గురవుతున్నారు.
అప్పుల అప్పారావులు చెప్పినట్లుగా డబ్బులున్నప్పుడు ఇస్తామని చెప్పడం ఏమిటన్న చర్చ కాంట్రాక్టర్లలో నడుస్తోంది. ఇప్పటికే ఎవరూ కాంట్రాక్టులు చేయాడనికి ముందుకు రావడం లేదు. కనీసం రూ. లక్ష కోట్ల వరకూ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని చెబుతున్నారు. వారికి ప్రాధాన్యత క్రమంలో కాకుండా .. అస్మదీయులకు మాత్రమే బిల్లులు చెల్లిస్తున్నారు. ఈ క్రమంలో కొత్త టెండర్లు పిలిచినా ఎవరూ రావడం లేదని చెప్పుకోవడానికి ఇలాంటి షరతులు పెడుతున్నారన్న వాదన వినిపిస్తోంది.
అనేక మంది కాంట్రాక్టర్లు ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదని కోర్టుకు వెళ్తున్నారు. కోర్టు అనేక సార్లు ఆగ్రహం వ్యక్తం చేసి బిల్లు చెల్లించాలని ఆదేశాలిస్తోంది. ఈ కారణంగా కోర్టులకు కూడా వెళ్లకూడదని షరతులు పెడుతోంది. మొత్తానికి ప్రభుత్వం దేశం మొత్తం తిరిగి చూసేలా… చేయడంలో ఎప్పటికప్పుడు సక్సెస్ అవుతోంది.