గడప గడపకూ వెళ్తోంది వైసీపీ కాదు… ప్రభుత్వమట. పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో పార్టీ గెలుపు కోసం ఈ కార్యక్రమాన్ని నిర్దేశించి రాత్రికి రాత్రే పేరు మార్చేశారు. వైసీపీ కాదు ప్రభుత్వం గడపగడపకూ వెళ్తుందని ప్రకటించారు. వైసీపీ పేరుతో ప్రజల్లోకి వెళ్తే ప్రజల నుంచి వచ్చే నిరసనలను ఎదుర్కోవడం కష్టమని..అదే ప్రభుత్వం పేరుతో వెళ్తే కేసుల భయంతో అయినా జనం నోరు విప్పరన్న ఉద్దేశంతో ఈ ఆలోచనను రాత్రికి రాత్రి చేసినట్లుగా తెలుస్తోంది.
ప్రజలు ఎవరూ తిరుగుబాటు చేయకుండా నేతలతో పాటు అధికారులు కూడా ఉంటారు. ఎవరైనా ప్రశ్నించడం.. గట్టిగా నిలదీయడం లాంటివి చేస్తే కేసులు పెట్టవచ్చని .. అలా చేస్తే ఇంకెవరూ ప్రశ్నించడం , నిలదీయడం చేయరని వైసీపీ వ్యూహకర్తల అంచనాగా భావిస్తున్నారు. ఇప్పటికే వైసీపీ నేతలు.. మూడేళ్లుగా గ్రామాల్లో కానీ.. పట్టణాల్లో కానీ ఎలాంటి పని చేయకుండా … ఇంటింటికి వెళ్లి ఏం చెప్పాలని మథనపడుతున్నారు. బిల్లులు రాని వైసీపీ క్యాడర్ కూడా ఈ కార్యక్రమంపై ఆసక్తిగా లేరు.
కేవలం సంక్షేమ పథకాలు అందుకున్న వారిని తాము కరోనా సమయంలో కూడా అప్పులు చేసి మరీ సాయం చేశామని చెప్పి వారిని ఓటు బ్యాంక్‌గా ఉంచుకోవడంపైనే దృష్టి పెడుతున్నట్లుగా భావిస్తున్నారు. నిజానికి గడపగడపకూ ప్రభుత్వం పోవాలంటే దానికో లెక్క ఉంటుంది. వైసీపీ నేతలతో పని ఉండదు. కానీ ఇక్కడ వైసీపీ నేతలు.. అధికారులు కలిసి కార్యక్రమం నిర్వహిస్తున్నారు.