వైసీపీ ముఖ్య నేతలు ఇటీవలి కాలంలో ఓ స్టేట్మెంట్ పదే పదే ఇస్తున్నారు. అదే.. మూడు రాజధానులపై తాము వెనక్కి తగ్గబోమని.. తమ విధానం అదేనని చెబుతున్నారు. విజయసాయిరెడ్డి దగ్గర్నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి వరకూ అదే చెబుతున్నారు. అయితే అసలు ఇప్పుడు పదే పదే నొక్కి చెప్పాల్సిన అవసరం ఏమొచ్చిందన్నదే చాలా మందికి వస్తున్న సందేహం. వారి విధానం మూడురాజధానులేనని ఏడాది కిందటే స్పష్టమయింది. కానీ ఒకే రాజధాని ఉండాలని ఇతర విపక్షాలు పోరాడుతున్నాయి. అది వేరే విషయం. వారి విధానం మూడు రాజధానులు కాబట్టే.. చట్టాలు చేసి.. న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయని తెలిసినా… ముందుకెళ్తున్నారు.
హైకోర్టు కర్నూలులో ఏర్పాటు న్యాయరాజధాని అనేది చట్టం చేస్తే చెల్లదని.. అందరికీ తెలుసు. అయినా చట్టం చేసి.. కోర్టుల్లో పోరాడుతోంది ప్రభుత్వం. అంత పట్టుదల ప్రదర్శిస్తున్న విషయం కళ్ల ముందు కనబడితే.. ఇప్పుడు కొత్తగా తాము మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని సర్టిఫికెట్లు స్వయంగా జారీ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందన్నది కీలకమైన ప్రశ్న. వెనక్కి తగ్గుతున్నారని.. ఎక్కడా ప్రచారం జరగడం లేదు. బహుశా అలా ప్రచారం జరగడానికే ఇప్పుడు.. వ్యూహం మార్చారన్న అభిప్రాయం కూడా రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. వెనక్కి తగ్గిందని.. ప్రచారం చేయడం ద్వారా.. రాజకీయంగా ఇంకే విధమైన ప్రయోజనాలు ఆశిస్తున్నారా.. అన్న చర్చ నడుస్తోంది.
వాస్తవానికి మూడురాజధానుల అంశంపై గతంలో ఉన్న స్పీడ్ ఇప్పుడు ప్రభుత్వం చూపించడం లేదు. కొద్ది రోజుల కిందటి వరకూ.. ఏ క్షణమైనా ప్రభుత్వ యంత్రాంగం అంతా విజయవాడకు వెళ్తుందన్నట్లుగా ఉండేది. కానీ ఇప్పుడు అలాంటి హడావుడి లేదు. ప్రకటనలు మాత్రం వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఆర్థిక సమస్యల్లో ఉండటం ఓ కారణం అయితే.. న్యాయపరమైన చిక్కులు మరో కారణం కావొచ్చంటున్నారు. అయితే జగన్ అసెంబ్లీలో వ్యక్తం చేసిన అభిప్రాయం ప్రకారం.. సీఎం ఎక్కడినుంచైనా పని చేసుకోవచ్చు. అది నిజం కూడా. జగన్ వెళ్లాలనుకుంటే రాత్రికి రాత్రి వెళ్లిపోవచ్చునని కానీ ఎందుకో ఆలోచిస్తున్నారని వైసీపీ నేతలు కొత్తగా చర్చ మొదలు పెడుతున్నారు.