రాజధాని రైతులు నిరసనలకు దిగడం.. హైకోర్టులోనూ పిటిషన్లు వేయడంతో.. ప్రభుత్వం అఘమేఘాలపై అమరావతి రైతులకు కౌలును అకౌంట్లలో జమ చేసింది ప్రభుత్వం. రైతు కూలీలకు సామాజిక పెన్షన్లు కూడా మంజూరు చేసింది. రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు సీఆర్డీఏ ఒప్పందం ప్రకారం.. ప్రతి ఏడాది ప్రభుత్వం కౌలు చెల్లిస్తుంది. ఈ కౌలును జూన్, జూలైలో చెల్లించాలి. ప్రభుత్వం మారిన తర్వాత కౌలు కోసం.. రైతులు ఉద్యమాలు చేయాల్సి వస్తోంది. రైతులు గొంతెత్తినప్పుడు జీవోలిస్తున్నారు. కానీ నిధులు ఇవ్వడం లేదు.
రోడ్డెక్కడమో..కోర్టుకు వెళ్లడమో చేసిన తర్వాత కౌలు చెల్లిస్తున్నారు. కౌలు అడిగిన రైతులపై లాఠీచార్జ్ చేయడం… మహిళా రైతుల్ని సైతం అరెస్ట్ చేయడంపై అన్ని పార్టీల నుంచి విమర్శలు ఎదురయ్యాయి. మరో వైపు రాజధానికి చెందిన రైతులు తమకు వెంటనే కౌలు ఇప్పించాలని హైకోర్టులో పిటిషన్ వేసారు. విచారణ జరిపిన హైకోర్టు రెండు రోజుల్లో చెల్లించాలని ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ పరిణామాల తర్వాత కౌలు కోసం రూ. 153 కోట్లు, పెన్షన్ ల కోసం రూ. 9 కోట్ల 73 లక్షల విడుదల చేశామని బొత్స ప్రకటించారు.
ప్రభుత్వం కొత్తగా భూములు అమ్ముకున్న రైతులకు కౌలు నిలిపివేయాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు వివరాలు సిద్ధం చేస్తున్నామని… బొత్స ప్రకటించారు. అమరావతికి భూములు ఇచ్చి… ఇప్పటికీ అమ్ముకోని వారికి మాత్రమే ఇక నుంచి కౌలు ఇస్తామని చెబుతున్నారు. అయితే.. 90 శాతం మందికిపైగా రాజధాని రైతులు తమ ప్లాట్లను అమ్ముకోలేదని చెబుతున్నారు.