వైసీపీ తరపున ఎమ్మెల్యేలు కూడా పోటీ చేయడానికి ఆసక్తి చూపించడం లేదన్న చర్చ జరుగుతున్న సమయంలో వైఎస్ హయాం నాటి సీనియర్లు పూర్తిగా వైసీపీ పనైపోయిందన్న అభిప్రాయాన్ని జనంలో కల్పిస్తున్నరు. ధర్మాన ప్రసాదరావు ఇప్పటికే ప్రాంతీయ వాదన ఎత్తుకున్నారు. ప్రత్యేక రాష్ట్రం అంటున్నారు. అధికార పార్టీ నేత ఇలా అంటున్నారంటే.. ఆ పార్టీ పనైపోయిందని ఒప్పుకున్నట్లేనన్న విశ్లేషణలు వస్తున్నాయి. తాజాగా ధర్మాన తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని జగన్కు చెప్పేశానని ప్రకటించి కలకలం రేపారు. తాను ఇక రాజకీయాల నుంచి విశ్రాంతి తీుకుంటానని చెప్పానన్నారు.
అయితే ఇంతటితో అయిపోలేదు.. జగన్ మాత్రం ఒప్పుకోలేదని.. ఈ ఒక్క సారికి పోటీ చేయమని అడిగారని.. జగన్మాట కాదనలేక పోటీ చేయడానికి సిద్ధమని చెప్పానని ధర్మాన చెప్పుకొస్తున్నారు. ధర్మాన మాటలు వింటే.. జగన్ బతిమాలితేనే పోటీ చేస్తున్నానని చెబుతున్నట్లుగా ఉంది. మరో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అయితే ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఇంటికెళ్లడం ఖాయమని నేరుగానే చెబుతున్నారు. ముందస్తు ప్రచారం జరుగుతోందని..అది జరిగితే ముందుగానే ఇంటికెళ్లడం ఖాయమని ఆయన పార్టీ కార్యక్రమంలోనే ప్రకటించారు. దీంతో పార్టీ నేతలకు మైండ్ బ్లాంక్ అయింది.
ఇంకా ఏడాదిన్న వరకూ సమయం ఉందని.. ఆ మేరకు అధికారం అనుభవించాలని.. అప్పుడైనాఇంటికి పోక తప్పదని ఆనం ఉద్దేశం. ఇటీవలి కాలంలో ఆనం ఇలాంటి వ్యాఖ్యలే చేస్తున్నారు. కోటంరెడ్డిని పిలిపించి మాట్లాడిన జగన్.. ఆనంను లైట్ తీసుకున్నారు. ఆయనను బుజ్జగించే ఆలోచన కూడా పెట్టుకోవడం లేదు. నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని ఇంచార్జ్ గా ప్రకటించారని వైసీపీ వర్గాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. కారణం ఏదైనా ఈ ఇద్దరు సీనియర్లు చేస్తున్న ప్రకటనలు..వైసీపీ కాడి పడేసిందన్న అభిప్రాయాన్ని కల్పిస్తున్నాయి.