సరిగ్గా ఏడాది క్రితం గోదావరి పుష్కరాల సమయంలో రాజమండ్రిలో జరిగిన త్రొక్కిసలాటలో 30మంది మరణించారు. ఆ విషాదఘటన జరిగిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం కూడా నష్టపరిహారం ఇస్తానని హామీ ఇచ్చింది. కానీ ఇచ్చిందో లేదో ఎవరికీ తెలియదు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి భాదిత కుటుంబాలని ఓదార్చారు. ఆ తరువాత మళ్ళీ వారి గురించి ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గానీ మాట్లాడిన దాఖలాలు లేవు. ఆ విషాద ఘటన జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా సాక్షి మీడియా ఆ వీడియో క్లిప్పింగులని మళ్ళీ ప్రదర్శించి, భాదిత కుటుంబాల ఆవేదనని, వారికి ప్రభుత్వ సహాయం అందకపోవడం గురించి విమర్శనాత్మక కధనాలు ప్రసారం చేసింది. అది మీడియా బాధ్యతే కనుక దానిని తప్పుపట్టలేము. కానీ ఇంత కాలం ఆ భాదిత కుటుంబాలని పరామర్శించని నేతలు కూడా వారికి చాలా అన్యాయం అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తుండటం విశేషం. ఆ సందర్భంగా వైకాపా నేతల విమర్శలు వింటే వారు భాదితులకి న్యాయం జరుగలేదని బాధపడుతున్నారా లేకపోతే ఆ వంకతో ప్రభుత్వంపై మరోమారు తమ అక్కసు తీర్చుకొంటున్నారా? అనే అనుమానం కలుగుతుంది. త్వరలో కృష్ణా పుష్కరాలు మొదలవబోతున్నాయి కనుక మళ్ళీ అటువంటి ప్రమాదాలు జరుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోమని ప్రభుత్వాన్ని హెచ్చరించినా బాగానే ఉండేది.
పుష్కరాల పేరుతో తెదేపా నేతలు జేబులు నింపుకొంటున్నారని, తమకి నచ్చిన వారికే కాంట్రాక్టులు కట్టబెడుతున్నారని వైకాపా సీనియర్ నేత కె.పార్ధసారధి ఆరోపించారు. రోడ్లు వెడల్పు కోసం విజయవాడలో కొన్ని ఆలయాలని కూల్చి వేసినప్పుడు అందరికంటే ముందుగా వైకాపా గట్టిగా అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఆ తరువాత భాజపా కూడా రంగంలో దిగడంతో ఆలయాల కూల్చివేత నిలిచింది. అదేవిధంగా ఒకవేళ పుష్కర పనులలో ఎక్కడయినా అవినీతి జరుగుతున్నట్లు వైకాపా గుర్తిస్తే దానిని బయటపెట్టి ప్రభుత్వాన్ని నిలదీయవచ్చు. అప్పుడు మిగిలిన పార్టీలు నిలదీస్తే ప్రతిపక్షాలు నిలదీస్తాయనే భయంతోనైనా అవినీతికి అడ్డుకట్టపడేది. కానీ వైకాపా నేతల ఆరోపణలు వింటే ఇంతకీ వారు పుష్కర పనులలో అవినీతి జరుగుతోందని బాధ పడుతున్నారా లేకపోతే తమ పార్టీ కాంట్రాక్టర్లకి పుష్కర పనులు ఇవ్వడం లేదని బాధ పడుతున్నారా? అని అనుమానం కలుగుతోంది.