జగన్ నిరాహార దీక్షలు చేసి చాలా రోజులే అయ్యింది. ఫిరాయింపుదారులను బుజ్జగించడానికే ఆయనకి సమయం సరిపోవట్లేదు. బహుశః అందుకేనేమో దానిపై తనకున్న పేటెంట్ హక్కులను ఇప్పుడు పార్టీలో నేతలతో షేర్ చేసుకొంటున్నట్లున్నారు. ఆ ఓపికున్నవాళ్ళు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని దీక్షలు చేస్తున్నారు. వారిలో మొదటి వ్యక్తి విశాఖ జిల్లా వైకాపా అధ్యక్షుడు గిదివాడ అమర్ నాథ్. విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేయనందుకు నిరసనగా నేటి నుంచి విశాఖలో జి.వి.ఎం.సి. ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద ఆమరణ నిరాహార దీక్షకు కూర్చొంటున్నారు. ఇది ఏ రాజకీయ ప్రయోజనమూ ఆశించి చేస్తున్న దీక్ష కాదని ఆయన స్పష్టం చేసారు. రెండేళ్ళు పూర్తవుతున్నా కూడా కేంద్రప్రభుత్వం ఇంతవరకు రైల్వే జోన్ ఏర్పాటు చేయకుండా, పదేపదే మళ్ళీ హామీనిస్తూ ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నిస్తోందని ఆవేదన వ్యక్తం చేసారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని గురించి కేంద్రాన్ని గట్టిగా నిలదీసి అడగకపోవడం చాలా బాధ కలిగిస్తోందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ పట్టించుకోకపోవడంతో వాటిపై ఒత్తిడి తెచ్చేందుకే తను ఆమరణ నిరాహార దీక్ష చేపట్టవలసి వస్తోందని అమర్ నాథ్ చెప్పారు. రాష్ట్ర ప్రయోజనం కోసం తను మొదలుపెట్టిన ఈ పోరాటానికి తెదేపా, భాజపాలు కూడా మద్దతు పలకాలని ఆయన కోరారు.
అమర్ నాథ్ దీక్షకు పార్టీ సీనియర్ నేతలు విజయ సాయి రెడ్డి, బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, ఎంపి వైవి సుబ్బారెడ్డి తదితరులు మద్దతు తెలుపడానికి తరలి వచ్చేరు. జగన్ ఆత్మీయ సమావేశాల (బుజ్జగింపుల కార్యక్రమం)తో బిజీగా ఉన్నందునో మరే కారణం చేతనో సంఘీభావం తెలిపేందుకు రాలేదు. సాధారణంగా వైకాపాలో జగన్ మాత్రమే ఇటువంటి దీక్షలు చేస్తుంటారు కనుక గుడివాడ అమర్నాథ్ ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోవడంతో ప్రజలు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఏమయినప్పటికీ జగన్ కాకుండా వైకాపాలో మరొకరు నిరాహార దీక్షలు చేయడం కొత్త ట్రెండేనని చెప్పవచ్చును.