తెలంగాణ వైసీపీ నేతలందరూ షర్మిల పార్టీలో చేరుతూంటే.. తెలంగాణ వైసీపీ అధ్యక్షుడు మాత్రం రూటు మార్చారు. ఆయన బీజేపీ బాట పట్టారు. తెలంగాణలో వైసీపీ ఇక ఉండదని.. ఉండకూడదని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని… షర్మిల పార్టీ ప్రకటన సమయంలో ప్రెస్ మీట్ పెట్టిన సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించేశారు. దాంతో ప్రస్తుతం షర్మిల పార్టీ తరపున హడావుడి చేస్తున్న పిట్ట రాంరెడ్డి, కొండా రాఘవరెడ్డి లాంటి తెలంగాణ వైసీపీ నేతలందరూ పోలోమంటూ పోయి షర్మిల పార్టీలో చేరిపోయారు. ఆ పార్టీ ప్రారంభం కాక ముందే హడావుడి ప్రారంభించారు. అందరి చూపు.. తెలంగాణ వైసీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డిపై పడింది. ఆయనను కూడా షర్మిల పార్టీలో చేరాలని… రాయబారాలు నడిచాయి.
వైఎస్ విజయలక్ష్మి కూడా ఫోన్ చేసి అడిగారు. షర్మిల తరపున ప్రతినిధులు వెళ్లి సంప్రదింపులు కూడా జరిపారు. కానీ గట్టు శ్రీకాంత్ రెడ్డి మాత్రం.. తాను వైసీపీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారు కానీ… షర్మిల పార్టీలో మాత్రం చేరడంలేదు. భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో గట్టు శ్రీకాంత్ రెడ్డికి మంచి పట్టు ఉంది. 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి.. మూడో స్థానం సాధించారు. 2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ నిర్ణయం ప్రకారం పోటీ చేయలేదు. ఆ సందర్భంలో… ఫలితాలు వచ్చిన తర్వాత.. టీఆర్ఎస్కు సహకరించేందుకే పోటీ చేయలేదని.. వస్తున్న విమర్శలకు జగన్ .. హుజూర్ నగర్ ఫలితాన్నే ఉదాహరణగా చెప్పారు.
తాము హుజూర్ నగర్లో పోటీ చేసి ఉంటే.. ఉత్తమ్ కుమార్ గెలిచేవారా అంటూ లాజిక్ లాగారు. అంత పట్టు ఉన్న గట్టు శ్రీకాంత్ రెడ్డి బీజేపీకే జైకొట్టారు. జాతీయ పార్టీలో చేరి.. హుజూర్ నగర్ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ జాతీయ పార్టీ బీజేపీనే.. ఇప్పటికే బీజేపీ పెద్దలతో చర్చలు కూడా జరిపారు. గట్టు రాజీనామాతో తెలంగాణలో వైసీపీ అంతర్థానం అయినట్లే. ఇక షర్మిల పార్టీనే వైసీపీ బ్రాంచ్‌గా అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.