అన్నా మీకు వయసయిపోయింది.. ఇక తప్పుకోండి అన్న సీనియర్లను.. మీరు పనికి రారు అని వదిలేసిన వాళ్లను జగన్ బతిమాలి మరీ పార్టీ పదవులు ఇస్తున్నారు. జగన్ అపసోపాలు చూసి అధికారంలో ఉన్నప్పుడు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేదు కదా అని నిష్టూరపడుతున్నారు ఆ నేతలు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత పదవుల్ని భర్తీ చేసేందుకు జగన్ ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక మంది అధికారం అనుభవించారు. విపరీతంగా సంపాదించుకున్నారు. ఇప్పుడు వారిలో అత్యధిక మంది పార్టీ కోసం చేసేందుకు ముందుకు రావడం లేదు. జిల్లా అధ్యక్ష పదవులు కూడా తీసుకోవడంలేదు. అధికార ప్రతినిధులుగా ఉండేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో యాంకర్ శ్యామలకు ఆ పదవి ప్రకటించారు. భూమన కరుణాకర్ రెడ్డి, రోజాలకు చాన్సిచ్చారు. వీరు తప్ప ఎవరూ లేనట్లు అయింది పరిస్థితి.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పొలిటికల్ వ్యవహారాల కమిటీలో నియమించారు. ఆయన పూర్తిగా డిప్రెషన్ లో ఉన్నారు. పెద్దగా పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం ఎప్పుడు మీద పడుతుందో తెలియక ఆయన టెన్షన్ లో ఉన్నారు. జగన్ రెడ్డిని నమ్మి అన్ని అడ్డగోలు పనులు చేశారు పెద్దిరెడ్డి. దానికి అనుభవించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ఇతర పార్టీల్లో కనీస బాధ్యతలు తీసుకోవడానికి ఎవరూ ముందుకు రావడంలేదు. వైసీపీ ఓడిపోయాక.. దాదాపుగా అందరూ అస్త్ర సన్యాసం చేశారు. ఒక్కరు కూడా పార్టీకి పని చేయడం లేదు.
ఒక్క ఓటమితో ఇంత ఘోరమైన పరిస్థితిని చూస్తామని జగన్ కూడా అనుకోలేకపోతున్నారు. చాలా మంది నేతలు సజ్జల రామకృష్ణారెడ్డిని పక్కన పెట్టాలని కోరుకుంటున్నారు. ఆయన సైలెంట్ గా ఉంటున్నారు కానీ.. కొత్త స్ట్రాటజిస్టు పనుల్ని కూడా ఆయనే చేస్తున్నారన్న అసంతృప్తి కనిపిస్తోంది. చాలా మంది నేతలు మీడియా ముందు మాట్లాడేందుకు జంకుతున్నారు. వైసీపీ స్టైల్లో మాట్లాడితే.. ప్రభుత్వం ఊరుకోదు. గతంలో మాట్లాడిన వాటికి వడ్డీతో సహా చెల్లిస్తుంది. ఇక కేసుల భయంతో పరారీలో ఉన్న వారి సంగతి చెప్పాల్సిన పని లేదు.
ఐదేళ్ల పాటు చెలరేగిన వైసీపీ ఇంత డ్రై అయిపోయిందేమిటా అని ఆ పార్టీ నేతలు కూడా అవాక్కవుతున్నారు. సంపాదన కోసం వచ్చారు కానీ ఎవరికీ పార్టీపై అభిమానం లేదని తేలిపోయిందని గుసగుసలాడుకుంటున్నారు.