వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలను వెలికితీసే పనిలో పడింది ఏపీలో కొలువుదీరిన కూటమి ప్రభుత్వం. ఇందులో భాగంగా తవ్విన కొద్ది ఒక్కొక్కటిగా వైసీపీ అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. అర్హతతో పని లేకుండా వైసీపీ కోసం పని చేసిన వారికి ఉద్యోగాలు కల్పించి మరీ లక్షల్లో జీతాలు చెల్లించిన ఉదంతం రాష్ట్ర ప్రజలను నివ్వెరపోయేలా చేస్తోంది.
గత ప్రభుత్వ పెద్దల సిఫార్సులతో ఈ ప్రగతి, ఆర్టీజీ విభాగాల్లో నియామకాలు జరిగాయి. ఏపీ డిజిటల్ కార్పోరేషన్, స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ లో వైసీపీ మద్దతుదారులే ఉద్యోగులుగా ఎంపికయ్యారు. వైసీపీ నేతల అనునయులు కావడంతో వీరిలో చాలామంది ఆఫీసుకు వెళ్లకపోయినా జీతాలు మాత్రం లక్షల్లో చెల్లించింది వైసీపీ సర్కార్.
వీరంతా వైసీపీకి అనుబంధంగా పని చేస్తూ, పార్టీ సోషల్ మీడియా కోసం పని చేస్తూ జీతాలను తీసుకున్నవారే. కొంతమంది తప్పుడు పత్రాలను సృష్టించి కార్పోరేషన్ నుంచి జీతాలను మింగేసినట్లుగా తెలుస్తోంది. ఈ సొమ్మును దోచిపెట్టేందుకు వైసీపీ సర్కార్ ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేయడం గమనార్హం.
ప్రస్తుతం కూటమి సర్కార్ ఈ విషయాలను ఆరా తీస్తోంది. ఎవరెవరు అప్పనంగా సర్కార్ సొమ్మును కాజేశారు..? అక్రమంగా ఎవరు జీతాలను పొందారు..? ఎలాంటి తప్పిదాలకు పాల్పడ్డారు..?అనే అంశాలపై నివేదిక కోరింది. ఈ నివేదిక అందిన తర్వాత ఈ విషయంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించే అవకాశం ఉంది.