ఎన్నికలు వస్తున్నాయి… ఎవరైనా జీతాలు రాలేదు.. భత్యాలు రాలేదు.. డీఏలు ఇవ్వలేదు.. అని నోరు తెరిచారో అంతే సంగతులు అని ప్రభుత్వం సంకేతాలు పంపుతోంది. సెక్రటేరియట్లో ఓ రెడ్డిగారు లంచం తీసుకుంటూంటే ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అసలు సెక్రటేరియట్లో ఏసీబీ దాడులా అని చాలా మంది ఆశ్చర్యపోయారు. అదీ కూడా రెడ్డి సామాజికవర్గం ఉద్యోగిని పట్టుకోవడంతో.. ఏదో మతలబు ఉందని సెక్రటేరియట్ లో చర్చ జరుగుతోంది.
నిజానికి జగన్ రెడ్డి సర్కార్ వచ్చాక ఉద్యోగుల్లో విచ్చలవిడిగా అవినీతి పెరిగింది. దేనికైనా ఓ రేటు కట్టేస్తున్నారు. చివరికి సీఎంఆర్ఎఫ్ చెక్కుల్ని కూడా కొట్టేశారు. అంతేనా సీఎం డిజిటల్ సంతకాల్ని కూడా అమ్మేసుకున్నారు. అంత ఘోరమైన అవినీతి జరుగుతూంటే.. ఎప్పుడూ ఏసీబీ అధికారులు పట్టించుకోలేదు. ఏసీబీకి కొన్ని వేల ఫిర్యాదులు వస్తూంటాయి… ఎప్పుడూ వాటిపై చర్యలు తీసుకోలేదు. నాలుగున్నరేళ్లలో ఏసీబీ చేసిన ఆపరేషన్లంటూ ప్రత్యేకంగా ఏమీ లేవు.
కానీ ఇటీవల ఏసీబీ దాడులు పెరిగాయి. జగన్ రెడ్డి ఫోటోను ఇంట్లో పెట్టుకున్న ఓ అధికారిణిపైనా దాడులు చేసి పెత్తఎత్తున ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు. ఉద్యోగులు నోరు తెరవకుండా ప్రత్యేకమైన సందేశాన్ని ఏసీబీ దాడుల ద్వారా పంపిస్తున్నారని భావిస్తున్నారు. ఎన్నికలకు ముందు ఏ మాత్రం రచ్చ చేసినా తమ కు డ్యామేజ్ అవుతుందని భావిస్తున్నారు. మొత్తంగా ఉద్యోగుల్ని భయపెట్టి.. నోరు మూయించాలని అనుకుంటున్నారు.