వైసీపీ నుంచి మరో నలుగురు ఎమ్మెల్సీలుగా ఎన్నికవబోతున్నారు. నలుగురి పేర్లను ఖరారు చేసి… గవర్నర్ కోటాలో నియమించేందుకు జాబితాను రాజ్‌భవన్‌కు పంపారు. ఏ క్షణమైనా వాటికి ఆమోద ముద్రపడే అవకాశం ఉంది. మోషెన్ రాజ్, అప్పిరెడ్డి, ఆర్వీ రమేష్, టీడీపీ నుంచి వైసీపీలో చేరిన తోట త్రిమూర్తులకు ఎమ్మెల్సీ ఖరారు చేశారు. తెలుగుదేశం హయాంలో నియమితులైన ఎమ్మెల్సీలు టీడీ జనార్ధన్, బీద రవిచంద్ర, గౌరివాణి శ్రీనివాసులు, పి.శమంతకమణి పదవీ కాలం పూర్తయింది. వీరంతా గవర్నర్ కోటా ఎమ్మెల్సీలే.వీరి స్థానంలో నలుగుర్ని ఎంపిక చేశారు.
శాసనమండలిని రద్దు చేయాలని శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపిన సీఎం జగన్ మండలిలో ఖాళీఅయిన స్థానాలను చాలా సీరియస్‌గా భర్తీ చేస్తున్నారు. సీఎం జగన్ తాజా ఢిల్లీ పర్యటనలో కూడా శాసనమండలి రద్దు అంశం ప్రస్తావనకు రాలేదు. జులై ఆఖరుకు నాటికి మండలిలో వైసీపీకి మెజార్టీ లభిస్తుంది. దీంతో ఆ పార్టీ నేతలెవరూ ఇప్పుడు శాసనమండలి రద్దు గురించి నోరెత్తడంలేదు. కేవలం మూడు రాజధానుల బిల్లు, అంతకుముందు ప్రాథమిక విద్యలో ఇంగ్లీష్ మీడియం బిల్లులను శాసనమండలి వెనక్కి పంపడంపై మాత్రమే.. జగన్ అసహనంతో ఉన్నారు. శాసనమండలిని రద్దు చేయాలని ఆఘమేఘాలపై కేబినెట్ లో తీర్మానం చేయించారు. ఆ వెనువెంటనే శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. అప్పట్నుంచి కేంద్రం వద్ద ఈ అంశం పెండింగ్ లో ఉంది. ప్రస్తుతం శాసనమండలిలో వైసీపీ బలం పెరుగుతోంది. అందుకే అంతా సైలెంట్ అయిపోయారు.
ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన సందర్భంగా మూడు రాజధానుల అంశం ప్రస్తావించారుగాని శాసనమండలి రద్దు గురించి మాట్లాడలేదు. సీఎం జగన్ ఢిల్లీ పర్యటన సందర్భంగా గురు, శుక్రవారాల్లో వైసీపీ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో కూడా ఈ అంశం ఎక్కడా ప్రస్తావనకు రాలేదు. ఈ నేపథ్యంలోనే వైసీపీ గవర్నర్ కోటాతోపాటు స్థానిక సంస్థలు , ఎమ్మెల్యే కోటా నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికతో శాసనమండలిలో తమ బలం పెరుగుతుందని అంచనా వచ్చింది. దీంతో.. ఇక మండలి రద్దు తీర్మానాన్ని వెనక్కి తీసుకుంటారన్న ప్రచారం జరుగుతోంది.