వైసీపీ నేతలు ఇంకా వాస్తవాలకు సుదూరంగా ఉన్నట్టే కనిపిస్తున్నారు. భ్రమల నుంచి బయటకు రాలేకపోతున్నారు. 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితమై ఉనికిని ప్రశ్నార్ధకం చేసుకుంది వైసీపీ. అయినా, పార్టీని గాడిన పెట్టాల్సిన అంశాలపై కాకుండా ఇతర అంశాలను తెరమీదకు తీసుకొచ్చి టీడీపీ, బీజేపీలకు లేనిపోని అస్త్రాలు అందిస్తున్నారా..? అనే చర్చ జరుగుతోంది.
రాష్ట్రంలో అధికారం కోల్పోయినా కేంద్రంలో తాము చక్రం తిప్పగలమన్న వైసీపీ నేతల వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. తమకు ఉభయ సభల్లో కలిపి 15 మంది ఎంపీలు ఉన్నారని, ఖచ్చితంగా రాజ్యసభలో బీజేపీకి తమ పార్టీ అవసరం ఉంటుందని విజయసాయి వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో విజయసాయి వ్యాఖ్యలను బీజేపీ సీరియస్ గా తీసుకుంటే పరిణామాలు ఎలా ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు.
ఏపీలో వైసీపీ అధికారం కోల్పోవడంతో ఆ పార్టీపై బీజేపీ అగ్రనాయకత్వం గట్టిగా ఫోకస్ చేస్తే వైసీపీ పునాదులు కూలడం ఖాయం. అంతేకాదు..విజయసాయి చెప్పిన అంశాన్ని రాష్ట్రానికి అన్వయింపజేస్తే మండలిలో తమకే ఎక్కువ బలముందన్న అహంకారంతో వైసీపీ ఉందని స్పష్టం అవుతోంది. ఏవైనా కొత్త బిల్లులు ఆమోదం పొందాలంటే మండలిలో తమ అవసరం ఉంటుందని ఊహల్లో తెలియాడుతున్నట్లు కనిపిస్తోంది.
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో టీడీపీ సైతం గట్టిగా ఫోకస్ చేస్తే మండలిలో బిల్లులకు ఆమోదం పొందటం కూటమి ప్రభుత్వానికి పెద్ద కష్టమేమి కాదు. రాజకీయాల్లో ఆరితేరిన విజయసాయి వంటి నేతలకు ఈ విషయం తెలియంది కాదు. అయినా, ఆయన మాత్రం ప్రత్యర్ధి పార్టీలు వైసీపీపై ఆధారపడాల్సి వస్తుందని వ్యాఖ్యానించడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ వ్యాఖ్యలు ఓ రకంగా బీజేపీ, టీడీపీలకు కొత్త ఆలోచనలు రేకెత్తించేలా ఉన్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.