వైసీపీ అంటే అంతే .. దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయండి అని సవాళ్లు విసురుతూ ఉంటుంది.కానీ విపక్షాలన్నీ కలవడానికి కారణం అవుతుంది. విశాఖలో జరిగింది పైకి పవన్ ను అడ్డుకోవడం…కానీ విపక్షాలందరూ కలవడానికి ఓ మార్గాన్ని ఏర్పాటు చేయడం పరోక్షంగా జరిగింది. విశాఖలో పవన్ ను అడ్డుకోవడంపై నేరుగా బీజేపీ, టీడీపీ స్పందించాయి. ప్రభుత్వ తీరుపై విమర్శలు చేశాయి. పొత్తులో ఉన్న బీజేపీ ఇటీవలి కాలంలో జనసేన పార్టీతో ఉందా లేదా అన్న సందేహాలున్నాయి. కానీ ఇవాళ పటాపంచలు అయ్యాయి.
విశాఖ ఎయిర్‌పోర్టు ఘటనలో ప్రభుత్వ తీరును తప్పుపడుతూ ఏపీ బీజేపీ నేతలు స్టేట్ మెంట్ ఇచ్చారు. ఆదివారం రోజున ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా పవన్ కల్యాణ్‌కు ఫోన్ చేసి సంఘిభావం తెలిపారు. తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఫోన్ చేశారు. ప్రభుత్వ వైఖరిపై తీవ్రంగా మండిపడ్డారు. ఇరువురూ పలు అంశాలపై చర్చించారు. వీరి మధ్య రాజకీయ చర్చలు జరిగి ఉండకపోవచ్చు కానీ.. అలా జరగడానికి ఓ మార్గం మాత్రం.. విశాఖ ఘటనల వల్ల ఏర్పడింది. ఇప్పుడు వారేమీ మాట్లాడుకోకపోయి ఉండవచ్చు కానీ.. రాజకీయంగా కలసి పని చేస్తే వచ్చే లాభాలపై వారిద్దరూ స్పష్టమైన అవగాహన ఉంటుంది కాబట్టి ముందు ముందు ఈ మాటలు మరింత బలమైన రాజకీయ బంధాన్ని ఏర్పాటు చేసుకోవడనికి ఉపయోగపడతాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి.
2014లో ఉన్న టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఏర్పడుతుందన్న అభిప్రాయం వినిపించడం ప్రారంభమయింది. అయితే ఆ దిశగా ఇప్పటి వరకూ ఎలాంటి ముందడుగులు పడలేదు. బీజేపీ సంగతి పక్కన పెడితే.. ఓట్లు చీలనివ్వబోమంటూ పవన్ కల్యాణ్ అదేపనిగా ప్రకటనలు చేసినప్పుడు.. ఆయన టీడీపీతో పొత్తుకు రెడీ అయ్యారన్న ప్రచారం జరిగింది. కానీ తర్వాత రెండు వైపులా సైలెంట్ అయిపోయారు. అయితే ఇప్పుడు నేరుగా పవన్ కల్యాణ్‌తో చంద్రబాబు మాట్లాడటంతో పొత్తుల అంశం తెరపైకి వచ్చింది. విపక్షాల మధ్య మాటలు కలవడానికి కారణం అయింది. దీనికి పరోక్షంగా వైఎస్ఆర్సీపీనే కారణం.