కడప జిల్లా విషయంలో సోము వీర్రాజు చేసిన అనుచిత వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. వెంటనే నాలిక కరుచుకున్న వీర్రాజు కూడా స్పందించారు. తన వ్యాఖ్యలు కడప జిల్లాను ఉద్దేశించి చేసినవి వివరణ ఇస్తూ ప్రకటన ఇచ్చారు. తాను కేవలం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి హత్యను ప్రస్తావిస్తూ మాత్రమే ఆ వ్యాఖ్యాలను చేశానన్నారు. తన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారన్నారు. కడప జిల్లా ప్రజలు మొత్తం హత్యలు చేస్తారని తాను అనలేదన్నారు. అయితే వైసీపీ నేతలు మాత్రం ఇంతమంచి అవకాశాన్ని ఎలా వదులుకోవాలని అనుకుంటున్నారు. వెంటనే రంగంలోకి దిగిపోయారు.
ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి సోము వీర్రాజు వ్యాఖ్యలు బాధిస్తున్నాయన్నారు. సోము వీర్రాజు కడప జిల్లాకు వస్తే ప్రజలు దాడి చేస్తారని.. తాను ప్రజాస్వామ్యంలో లేకపోయి ఉంటే .. సోము వీర్రాజు నాలుక కోసి ఉండేవాడినన్నారు. ఇక గడికోట శ్రీకాంత్ రెడ్డి కూడా స్పందించారు. సోము వీర్రాజు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కడప జిల్లా ప్రజలు తాము పేదరికంలో ఉన్నప్పటికీ ఇతరులు బాగుండాలని కోరుకుంటారన్నారు. కడప జిల్లాను టీడీపీ నేతలు కూడా కించ పరుస్తారని.. చంద్రబాబు పులివెందుల పంచాయతీ.. రౌడీయిజం అంటారని విమర్శలు గుప్పించారు.
వైసీపీ నేతలు సోము వీర్రాజు అన్న మాటకు విపరీతంగా పబ్లిసిటీ చేస్తూ.. కడపను మరింత కించపరిచినా పర్వాలేదు.. రాజకీయ మైలేజీ పొందాలని ఆరాటపడుతున్నారు. సోషల్ మీడియాలో వైసీపీ కి చెందిన వారు ఇదే పని మీద ఉన్నారు. సోము వీర్రాజు వ్యాఖ్యలకు ఎక్కడా లేని పబ్లిసిటీ చేస్తున్నారు. పోటీగా బీజేపీ నేతలు వివేకానందరెడ్డి హత్య కేసును ప్రస్తావిస్తున్నారు.