తెదేపాలోకి వెళ్ళిపోయినా తన 8 మంది ఎమ్మెల్యేలపై ఏవిధంగా అనర్హత వేటు వేయించాలని వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి పట్టు విడవని భేతాళుడిలాగ పదేపదే ప్రయత్నిస్తున్నారు. అందుకోసం అయన ముందున్న ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకొంటున్నారు కానీ తెదేపా వ్యూహాల ముందు ప్రతీసారి చిత్తయిపోతున్నారు. నెల రోజుల వ్యవధిలో మళ్ళీ నిన్న ముచ్చటగా మూడవసారి, ఆ 8మందితో సహా తన పార్టీ ఎమ్మెల్యేలందరికీ విప్ జరీ చేసారు. ఈ నెల 29,30 తేదీలలో అందరూ తప్పనిసరిగా శాసనసభకు హాజరయ్యి, సభలో ద్రవ్య వినిమయ బిల్లుకి వ్యతిరేకంగా ఓటు వేయాలని ఆదేశిస్తూ నిన్న విప్ జారీ చేసారు.
ఈవిధంగా విప్ జారీ చేయడం వెనుక ఉన్న తన ఉద్దేశ్యాన్ని జగన్మోహన్ రెడ్డి దాచుకొనే ప్రయత్నాలేవీ చేయడంలేదు. చేసినా, చేయకపోయినా అవి ఆ 8మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడానికేననే విషయం అందరికీ తెలుసు. అందుకే ఆయన స్వయంగా శాసనసభలో ఆ విషయం బయటపెట్టుకొన్నారు. దాని వలన అందరిలో మరింత నవ్వులపాలవుతున్నారు తప్ప ఆయన ప్రయత్నాలు ఫలించడం లేదు. బహుశః ఈసారి కూడా మళ్ళీ అదే పరిస్థితి ఎదురవవచ్చును.
తన పార్టీ ఎమ్మెల్యేలని తెదేపా ఎత్తుకుపోయినందుకు ఆయనకీ ఆగ్రహం కలగడం సహజమే. ఆ విషయాన్ని నేరుగా ప్రస్తావించి, వారిపై వేటు వేయమని కోరుతూ స్పీకర్ కి లేఖ ఇవ్వడం, ఆయన చర్యలు తీసుకోకపోతే న్యాయపోరాటం చేయడం వంటి చర్యలు చేపట్టి ఉంటే సరిపోయేది. కానీ అందుకోసం ఆయన ఎంచుకొన్న మార్గాలు సరయినవి కాకపోవడంతో స్వయంగా ఆయన, వైకాపా నేతలు కూడా అందరి ముందు చులకన అవుతున్నారు.
ప్రజలకు ప్రభుత్వంపై, తమకు స్పీకర్ పై విశ్వాసం పోయిందని చెపుతూ అవిశ్వాస తీర్మానాలు ప్రవేశ పెట్టారు. కానీ వాటి అసలు ఉద్దేశ్యం 8మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడానికే. అదే విషయం ఆయనే స్వయంగా శాసనసభలో చెప్పుకొని అందరి ముందు చులకనయ్యారు. ఒకే తప్పుని వరుసగా ఇన్నిసార్లు చేస్తుండటం చాలా విస్మయం కలిగిస్తోంది.
శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు సభలో అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో మాట్లాడుతూ “అసలు వైకాపా ఎమ్మెల్యేలు పార్టీ విడిచి ఎందుకు వెళ్లిపోతున్నారో తెలుసుకోమని” జగన్మోహన్ రెడ్డి కి సూచించారు. జగన్ అనుసరిస్తున్న ఇటువంటి విచిత్ర వైఖరితో విసుగెత్తిపోయే వారు పార్టీని వీడుతున్నారని యనమల చెప్పారు. ఆ కారణంగానే ఆ 8మంది పార్టీని వీడలేదని అందరికీ తెలుసు కానీ యనమల మాటలలో ఎంతో కొంత వాస్తవం ఉందనే సంగతి జగన్ గ్రహిస్తే మంచిది.