తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ఎన్నికలకు ముందు సామాజిక పెన్షన్లు పొందే వారికి… భారీ తాయిలం ఇచ్చారు. రూ. వెయ్యి ఉన్న పెన్షన్ను.. రూ. రెండు వేల చేశారు. ఎన్నికలకు ముందే నిర్ణయం తీసుకుని అమలు చేయడం ఖాయమైపోయింది. ఇప్పుడు… ఎన్నికల్లో ఈ పెన్షన్లే.. పార్టీలకు కులమతాలకు అతీతమైన ఓటు బ్యాంకుగా మారుతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీకి. తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్కు అత్యధికంగా.. ఈ సామాజిక పెన్షన్లు తీసుకునే వృద్ధులే ఓట్లు వేశారన్న విశ్లేషణ ఉంది. ఈ క్రమంలోనే టీడీపీ కూడా.. “ఎన్టీఆర్ భరోసా” కింద అందిస్తున్న అన్నిరకాల సామాజిక పింఛన్లను రెట్టింపు చేశారు. ఈ నెల నుంచి అమలు చేయబోతున్నారు. ఇప్పటికే ఈ నెల పెన్షన్లు పంపిణీ చేసినందున… జనవరి నెలది కూడా కలిపి ఫిబ్రవరిలో ఒకేసారి రూ.3 వేలు ఇవ్వబోతున్నారు.
ఇక దీనికి కౌంటర్ ఇవ్వడానికి… వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కసరత్తు ప్రారంభించింది. జగన్ ఎన్నికల హామీల్లో … పెన్షన్లు రూ. రెండు వేలు చేయడం కూడా ఒకటి. దాన్ని చంద్రబాబు అమలు చేసేశారు. ఇప్పుడు.. వైసీపీ నేతలు ఏం చెప్పుకున్నా ప్రయోజనం ఉండదు. పాదయాత్ర వల్లే ఒత్తిడి గురై చంద్రబాబు పెన్షన్లు పెంచారని..జగన్ ఎంత చెప్పుకున్నా… ఇచ్చే వాడికే ఆదరణ ఉంటుంది కానీ.. చెప్పుకునేవారికి కాదు. అందుకే.. వైసీపీ ఇప్పుడు కొత్త వ్యూహం అమలు చేసే అవకాశం కనిపిస్తోంది. తాను వస్తే.. నెలకు రూ. 3వేలు పెన్షన్ ఇస్తానని.. మరో వెయ్యి రూపాయలు పెంచుతానని ప్రకటించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. పాదయాత్రలోనే.. చంద్రబాబు రూ. రెండు వేలిస్తే.. తాను మూడు వేలిస్తాననే… తరహాలో ఆయన ప్రసంగాలు చేశారు. దాన్ని ఇప్పుడు.. వైసీపీ నిజం చేసే అవకాశం ఉంది.
అయితే.. చంద్రబాబు పెన్షన్ల పెంపు నిర్ణయాన్ని వ్యూహాత్మకంగా తీసుకున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ముగింపు సందర్భంగా.. ఇచ్చిన హామీల్లో… పెన్షన్లు రూ. 2వేలు మాత్రమే చేస్తానని చెప్పారు. చంద్రబాబు పెంచుతారని కానీ.. చంద్రబాబు పెంచితే.. తాను పెంచుతానని కానీ చెప్పలేదు. దాంతో.. ఇప్పుడు.. జగన్ తాను వస్తే రూ. 3వేలు ఇస్తానని చెప్పినా… ప్రజలు నమ్మడం కష్టమే. ఓట్ల కోసం… అలా చెబుతున్నారని ప్రజలు భావించడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఏదైనా కానీ… సంక్షేమం పేరుతో… ప్రజలకు పప్పుబెల్లాలు పంచి పెట్టి ఓట్ల వేట సాగించడం మాత్రం.. కొత్త పుంతలు తొక్కడం ఖాయంగా కనిపిస్తోంది.