వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు అసహనం పెరిగిపోతోంది. విధానపరమైన అంశాలపై విమర్శలకు సమాధానం చెప్పడానికి వారు ఎంచుకుంటున్న భాష… రాను రాను దిగజారిపోతోంది. ఈ విషయంలో పెడన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్.. మరీ దారుణంగా మాట్లాడుతున్నారు. నిన్న వైసీపీ కేంద్ర కార్యాలయంలోనే ప్రెస్‌మీట్ పెట్టి.. ఇష్టం వచ్చినట్లుగా విపక్ష నేతలపై బూతులు లంకించుకున్నారు. జనసేన, టీడీపీ నేతల్ని ఎవర్నీ వదిలి పెట్టలేదు. పవన్ కల్యాణ్‌ను పిచ్చికుక్క అనేశారు. పీకే అంటే పిచ్చికుక్క అనే అర్థం అని ప్రకటించారు. ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న అచ్చెన్నాయుడు అచ్చోసిన అంబోతని.. బుచ్చయ్యచౌదరిని బొంకలేక బొంకేవాడని.. బుద్దా వెంకన్నను.. బొల్లిగాడని.. ఇలా.. ఇష్టం వచ్చినట్లుగా తిట్టేశారు.
జోగి రమేష్ వ్యాఖ్యలు … తిట్లు చూసి.. మీడియా సమావేశంలో ఉన్న వారు కూడా.. తలదించుకోవాల్సి వచ్చింది. రాజకీయాలు అంటే… విధానపరమైన అంశాలపై విమర్శలు చేసుకుంటారు. కానీ ఇలా వ్యక్తుల్ని.. వారి బ్యాక్‌గ్రౌండ్‌ని టార్గెట్ చేసుకుని తిట్లు లంకించుకోవడం ఏమిటో ఎవరికీ అర్థం కాని విషయం. ఇలా బండ బూతులు తిడితే.. వారు మనస్తాపానికి గురయి.. విమర్శలు చేయడం మానేస్తారేమోనన్న వ్యూహాన్ని అనుసరిస్తున్నారేమో కానీ.. ఈ మాటలు వింటున్నవాళ్లకి మాత్రం అసహ్యం వేస్తోంది. ఆయన మాటలను.. మీడియా చానళ్లు కూడా ప్రసారం చేశాయి.
సాధారణంగా.. వైసీపీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్‌మీట్ పెట్టాలంటే.. సొంత ఎజెండాను ఎవరూ మాట్లాడరు. పూర్తిగా రెడీ అయ్యే స్క్రిప్టులో చదవుతారు. అలాంటిది.. జోగి రమేష్.. అలా బూతులు మాట్లాడారంటే… వైసీపీ విధానంలో భాగంగానే ఆయన మాట్లాడారా..అన్న అనుమానాలు రాక మానవు. బూతులు చెప్పడానికి రాయడానికి సాహిత్య పండితులు అక్కర్లేదు. జోగి రమేష్ ఒకటంటే.. ఆ మాటలు పడిన వాళ్లు రెండు అనగలరు.. కానీ.. ఆ పరిస్థితి ఎక్కడికి దారి తీస్తుంది..? సోషల్ మీడియాలో చిల్లర వ్యాఖ్యలు చేసుకునే.. రాజకీయ పార్టీల కార్యకర్తల కన్నా.. బయట నేతల మాటలే దిగజారిపోయే పరిస్థితి వచ్చింది. దీనికి సిగ్గుపడాల్సింది రాజకీయ నేతలే.