మచిలీపట్నం నౌకాశ్రయం నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ పద్దతిలో భూసేకరణ చేయడానికి ఇటీవల నోటిఫికేషన్ ఇచ్చింది. నౌకాశ్రయం నిర్మాణం పేరుతో అవసరమైన దానికంటే చాలా ఎక్కువగా ప్రభుత్వం భూసేకరణ చేస్తోందని ఆరోపిస్తూ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలన్నీ దానిని గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే ఒకసారి మచిలీపట్నంలో రైతులతో అవి ఒక సమావేశం నిర్వహించాయి. వైకాపా నేతృత్వంలో వామపక్షాలు మళ్ళీ నిన్న మరొకసారి రైతులతో సమావేశం అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఈ బలవంతపు భూసేకరణని అడ్డుకొనేందుకు, వైకాపా ఎమ్మెల్యే పేర్ని నాని నేతృత్వంలో వామపక్షాల సభ్యులతో కలిసి ‘భూసంరక్షణ కమిటి’ ని కూడా ఏర్పాటు చేసింది. మచిలీపట్నం రేవు కోసం భూములు ఇవ్వవద్దని వారు రైతులని కోరారు. వారి తరపున తాము నిలబడి పోరాడుతామని హామీ ఇచ్చారు. ల్యాండ్ పూలింగ్ పద్దతిలో రాజధాని ప్రాంతంలో భూసేకరణ చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఆ రైతులని ఏవిధంగా మోసం చేస్తోందో, వారి ఏవిధంగా నష్టపోతున్నారో తెలియజేసేందుకు మచిలీపట్నం రైతులని ఆ కమిటీ సభ్యులు త్వరలో తుళ్ళూరుకి తీసుకువెళ్ళబోతున్నారని తాజా సమాచారం.
కనుక మచిలీపట్నం రేవు కోసం భూసేకరణ వ్యవహారంలో మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రతిపక్షాలకి మద్య పెద్ద యుద్ధం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వైకాపా-తెదేపాల మధ్యనే ఈ యుద్ధం జరుగవచ్చు.
గత ఏడాది రాజధాని భూసేకరణ సమయంలో కూడా వాటి మద్య ఇదేవిదంగా చాలా తీవ్ర యుద్ధం జరిగింది. కానీ రాష్ట్రానికి రాజధాని లేకపోవడంతో రాజధాని నిర్మాణం ఒక సెంటిమెంటుగా మారింది. అందుకే దాని కోసం జరుగుతున్న భూసేకరణని రాష్ట్ర ప్రజలు గట్టిగా వ్యతిరేకించలేదు. కనుక, ప్రతిపక్షాలు కూడా వెనక్కి తగ్గక తప్పలేదు. ప్రజల సెంటిమెంటుతో ముడిపడున్న ఆ వ్యవహారాన్ని తాము ఇంకా మొండిగా వ్యతిరేకిస్తే, ప్రతిపక్షాలకి రాజధాని నిర్మాణం ఇష్టం లేకనే అడ్డుపడుతున్నాయనే తెదేపా వాదనలను ప్రజలు నమ్మితే చివరికి తామే నష్టపోతామనే భయంతోనే ప్రతిపక్షాలు వెనక్కి తగ్గాయి. అందుకే రాష్ట్ర ప్రభుత్వం తను అనుకొన్నట్లుగానే రైతుల నుంచి 33,000 ఎకరాలు సేకరించగలిగింది.
రాజధాని విషయంలో ప్రజలలో సెంటిమెంటు ఏర్పడి ఉండవచ్చు కానీ మచిలీపట్నం రేవుకి అటువంటి సెంటిమెంట్లు ఏమీ లేవు కనుక ఈసారి ప్రతిపక్ష పార్టీలు దానిని గట్టిగానే అడ్డుపడవచ్చు కనుక అక్కడ భూసేకరణ చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి చాలా కష్టం కావచ్చు. కనుక ఈ సమస్యని ఇంకా సున్నితంగా పరిష్కరించవలసి ఉంటుంది. లేకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి తీవ్ర అప్రదిష్ట కలిగే ప్రమాదం ఉంటుంది.