తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయ అక్రమ నిర్మాణం కూల్చివేత తర్వాత ఆ పార్టీ ఆఫీసుల వ్యవహారమంతా బయటకు వస్తోంది. పార్టీ కార్యాలయాల పేరుతో విలువైన భూములను కొట్టేసినట్లు అధికారుల దృష్టికి రావడంతో ఇందుకు సంబంధించిన వివరాలను సేకరించే పనిలో పడ్డారు అధికారులు.
వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రతి జిల్లాలో పార్టీ ఆఫీసుల నిర్మాణం కోసం రెండేసి ఎకరాలను కేటాయించేసుకుంది. ఇందుకోసం విలువైన భూములను కొట్టేసింది వైసీపీ. గవర్నమెంట్ వాల్యూ ప్రకారం ఆ భూముల విలువ రూ.900 నుంచి రూ.1000 కోట్ల వరకు ఉంటుందని అంచనా. బహిరంగ మార్కెట్ లో 2వేల కోట్లకు పైగానే ఉంటుందని అంటున్నారు.
తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయం అక్రమ కట్టడమని తేలాక రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ ఆఫీసులపై దృష్టిసారిస్తే సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పలు చోట్ల వైసీపీ కేటాయించుకున్న స్థలాలు అక్రమమని తేలగా, భవన నిర్మాణాల కోసం ఏకంగా 15కోట్ల నుంచి 20కోట్ల వరకు ఖర్చు అయినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆ ఖర్చుల వివరాలు చెప్పేందుకు వైసీపీ నేతలు బిక్కమొహం వేస్తున్నారు.
ఈ విషయంలో వైసీపీ పెద్దల అవినీతి, అక్రమాలపై కేంద్ర ప్రభుత్వానికి కూటమి నేతలు ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది.