వైకాపా నేతలు యధా రాజ తధా ప్రజా అన్నట్లుగా మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్ల ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డే చాలా అనుచితంగా మాట్లాడుతున్నప్పుడు, ఆ పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు వేరేలా మాట్లాడుతారనుకోలేము. చిత్తూరు జిల్లా వైకాపా నేత భూమన కరుణాకర్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి, హోం మంత్రిపై నోరు పారేసుకొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కన్యాశుల్కంలో గిరీశం వంటివాడని, హోం మంత్రి చిన రాజప్ప హోం గార్డుకి ఎక్కువ పోలీస్ కానిస్టేబుల్ కి తక్కువ అన్నట్లుగా ఉన్నారని ఎద్దేవా చేశారు.
ఒక ముఖ్యమంత్రిని, హోం మంత్రిని ఉద్దేశ్యించి అంత చులకనగా, అవమానకరంగా మాట్లాడం చాలా తప్పు.రాజకీయాలలో ఉన్నవాళ్ళు ప్రజలను ఆకట్టుకోవడానికో లేకపోతే తమ అధినేత మెప్పు పొందడానికో ఈవిధంగా మాట్లాడటం వలన రాజకీయాల స్థాయిని వారె దిగజార్చుకొన్నట్లవుతుంది. దాని వలన రాజకీయాలలో ఉండే వాళ్ళే మళ్ళీ ఇబ్బందిపడక తప్పదు. తుని ఘటనల వెనుక భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నారని తెదేపా నేతలు ఆరోపించారు. ఆ కేసుని దర్యాప్తు చేస్తున్న సిఐడి పోలీసులు అటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తే ఎవరూ తప్పు పట్టరు కానీ ఇంతవరకు వారు అటువంటి అనుమానాలు వ్యక్తం చేయలేదు. కనీసం భూమనని పిలిచి విచారించ లేదు. ఆయనపై కేసు నమోదు చేయలేదు. కనుక ఆయన విషయంలో తెదేపా నేతలు అత్యుత్సాహం ప్రదర్శించారని అర్ధమవుతోంది. వారు అప్పుడు అత్యుత్సాహం ప్రదరిస్తే, ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నట్లుంది. కానీ ఆ అత్యుత్సాహంలో ముఖ్యమంత్రి, హోం మంత్రి పట్ల చులకనగా, అవమానకరంగా మాట్లాడినందుకు, మళ్ళీ తెదేపా నేతల నుంచి ఎలాగూ ఘాటైన విమర్శలు వినక తప్పదు కానీ ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం న్యాయపరమైన చర్యలు తీసుకొంటే ఇబ్బందిపడేది తనేనని భూమన గ్రహిస్తే బాగుంటుంది.
అయన ముఖ్యమంత్రి, హోం మంత్రిని ఉద్దేశ్యించి ఆయన మాట్లాడుతూ, “వారిద్దరూ కలిసి ప్రశాంతమైన ఉభయగోదావరి జిల్లాలలో యుద్ధవాతావరణం సృష్టించారని ఆరోపించారు. ఉద్యమకారులపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తూ, మీడియాపై ఆంక్షలు విధించి భావప్రకటన సేచ్చని హరిస్తూ మళ్ళీ ఎమర్జన్సీ రోజులని గుర్తు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి కూడా నానాటికీ క్షీణిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇంత తీవ్రమైన పరిస్థితులు నెలకొని ఉంటే, ముఖ్యమంత్రి వాటి గురించి ఆలోచించకుండా వైకాపా ఎమ్మెల్యేల ఫిరాయింపుల గురించే ఆలోచిస్తున్నారని విమర్శించారు. పార్టీ ఫిరాయిన్చినవారిపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా స్పీకర్ కూడా చాలా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని కనుక కేంద్రప్రభుత్వం ఫిరాయింపుల చట్టానికి సవరణలు చేసి, ఆ అధికారాన్ని ఎన్నికల సంఘానికి అప్పగించాలని” కోరారు.