కాపులకు రిజర్వేషన్లు కోరుతూ ముద్రగడ పద్మనాభం నేతృత్వంలో తునిలో జరిగిన కాపు ఐక్య గర్జన సభ అనంతరం జరిగిన విద్వంసం యాదృచ్చికంగా జరిగింది కాదని, దాని వెనుక వైకాపా నేతల హస్తం ఉందని తెదేపా నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. తిరుపతికి చెందిన వైకాపా నేత భూమన కరుణాకర్ రెడ్డి కాపు గర్జన సభకు ముందు ముద్రగడని వచ్చి కలిసారని, ఆ తరువాత కూడా ముద్రగడతో నిరంతరం ఫోన్లో మాట్లాడినట్లు, ఆ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు కాల్-రికార్డ్స్ ద్వారా కనుగొన్నారని తెదేపా నేతలు అఆరోపిస్తున్నారు. దానిని ఆయన ఖండించారు. “నాకు ముద్రగడతో చాలా ఏళ్లుగా పరిచయం ఉంది. నేను ఆయనను అప్పుడప్పుడు కలుసుకుంటూనే ఉంటాను. తెదేపా నేతలు చెపుతున్నట్లుగా నేను ఆయనని కాపు గర్జన సభకి ముందు కలవలేదు. నెలరోజుల ముందు కలిశాను. తెదేపా నేతలు రాజకీయ దురుదేశ్యంతోనే నాపై ఆవిధంగా ఆరోపణలు చేస్తున్నారు. వారికి నాపై అనుమానం ఉంటే సి.ఐ.డి.తో కాదు సి.బి.ఐ.తో దర్యాప్తు చేయించినా నాకు అభ్యంతరం లేదు. నాపై నిరాధారమైన ఆరోపణలు చేస్తే సహించాను,” అని హెచ్చరించారు.
కరుణాకర్ రెడ్డికి తుని విద్వంసంతో సంబంధం ఉందని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు కానీ ఆ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఆయన గురించి ఇంతవరకు ఒక్క ముక్క కూడా ఆవిధంగా మాట్లాడకపోవడం గమనార్హం. వారి దర్యాప్తులో సేకరించిన్ కాల్-డాటాలో కరుణాకర్ రెడ్డి ఆ సమయంలో ముద్రగడతో మాట్లాడినట్లు కనుగొన్నారని తెదేపా నేతలు చెపుతున్నారే తప్ప పోలీసులు చెప్పకపోవడం విశేషం. ఒకవేళ తెదేపా నేతలు చేస్తున్న ఆరోపనలే నిజమనుకొంటే, పోలీసులు కరుణాకర్ రెడ్డిని ఈపాటికే పిలిచి విచారించి ఉండాలి కదా? ఆయనపై కేసు నమోదు చేసి ఉండాలి కదా? ఒకవేళ కరుణాకర్ రెడ్డికి ఆ విద్వంసంతో సంబంధం ఉందని తెదేపా నేతలు భావిస్తున్నట్లయితే, ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వమే అధికారంలో ఉంది గాబట్టి ఆయనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయమని పోలీసులను ఆదేశించవచ్చు కదా? కానీ అటువంటివేమీ చేయకుండా కేవలం ఆరోపణలకే పరిమితం అవుతున్నారంటే దాని అర్ధమేమిటి? కరుణాకర్ రెడ్డి చెపుతున్నట్లుగా తెదేపా నేతలు రాజకీయ దురుదేశ్యంతోనే ఆరోపణలు చేస్తున్నారని అనుమానించవలసి వస్తోంది.