పార్టీ మారినవారు మళ్ళీ స్వంత పార్టీకి తిరిగివస్తుండటం చాల సామాన్యమైన విషయమే. కానీ రోజుల వ్యవధిలోనే గోడకి కొట్టిన బంతిలాగా స్వంత పార్టీలోకి తిరిగి రావడం చాలా అరుదుగా కనబడుతుంది. చిత్తూరు జిల్లాలో పలమనేరు వైకాపా ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఇటీవల తెదేపాలో చేరిన సంగతి తెలిసిందే. ఆయనతో బాటు బైరెడ్డిపల్లి ఎంపిపి విమల కూడా తెదేపాలో చేరారు. కానీ “తూచ్! నేను తెదేపాలో చేరలేదు. అభివృద్ధి పనుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చిద్దామని వెళితే ఆయన అమర్నాథ్ రెడ్డితో పాటు నాకు కూడా పొరపాటున తెదేపా కండువా కప్పేశారని, కానీ నేటికీ నేను వైకాపాలోనే కొనసాగుతున్నాను,” అని చెప్పుకొని వైకాపా ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి చేత వైకాపా కండువా కప్పించుకొన్నారు.
ఒక ఎంపిపిపి స్థాయి వ్యక్తి ముఖ్యమంత్రితో అభివృద్ధి గురించి చర్చించడానికి వెళ్ళారంటే నమ్మశక్యంగా లేదు. పార్టీ మారుతున్న అమర్నాథ్ రెడ్డితో కలిసి వెళ్లి ముఖ్యమంత్రి చేత తెదేపా కండువా కప్పించుకొని, 10 రోజుల తరువాత ఆమె ఈవిధంగా చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. బహుశః ఆమె అమర్నాథ్ రెడ్డి ఒత్తిడితోనే తెదేపాలో చేరినట్లయితే, వైకాపాలోకి తిరిగి వచ్చినప్పుడు అదే ముక్క చెపితే నమ్మశక్యంగా ఉండేది. లేదా తెదేపాలో ఇమడలేక తిరిగి వచ్చేశానని చెప్పుకొన్నా ఆమె మాటని నమ్మేవారు. కారణాలు ఏవైనప్పటికీ పార్టీ మారిన 10 రోజుల్లోనే ఆమె వెనక్కి తిరిగి వచ్చేసి సరికొత్త రికార్డు నెలకొల్పారని చెప్పక తప్పదు.